
భద్రాచలంలో రూ.23 వేల విలువైన అక్రమ ఎంటీపీ కిట్ల స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఓ హోల్‌సేల్ మెడికల్ షాప్‌లో అనధికారికంగా నిల్వ చేసిన 52 ఎంటీపీ (మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ) కిట్లను తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) డ్రగ్స్ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.23,296గా అధికారులు వెల్లడించారు.
టీజీ సేఫ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. భద్రాచలంలోని జీసీసీ రోడ్డులో ఉన్న ఓ హోల్‌సేల్ మెడికల్ షాప్‌పై శనివారం అధికారులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. తనిఖీల్లో ‘ఎ-కేర్ కిట్’ పేరుతో ఉన్న 52 ఎంటీపీ కిట్లు గుర్తించారు. వాటిని సరైన కొనుగోలు బిల్లులు లేకుండానే విక్రయానికి నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఈ కిట్ల తయారీ తేదీ జూన్ 2026 కాగా.. గడువు తేదీ మే 2028గా ఉంది. హరిద్వార్‌కు చెందిన సైనోకెమ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వీటిని తయారు చేసినట్లు, ముంబైలోని డీకేటీ ఇండియా మార్కెటింగ్ చేసినట్లు కిట్లపై పేర్కొన్నట్లు టీజీ సేఫ్ తెలిపింది. చెల్లుబాటు అయ్యే కొనుగోలు బిల్లులు లేకుండా మందులను నిల్వ చేసి విక్రయించడం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్–1940, దాని కింద రూపొందించిన నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు.
ఎంటీపీ కిట్లలో మిఫెప్రిస్టోన్, మిసోప్రోస్టోల్ వంటి మందులు ఉంటాయి. వైద్యుల సూచన, పర్యవేక్షణలో నిర్దిష్ట పరిస్థితుల్లో ప్రారంభ దశ గర్భధారణను వైద్యపరంగా ముగించేందుకు వీటిని ఉపయోగిస్తారు. అయితే వైద్యుల పర్యవేక్షణ లేకుండా లేదా తప్పుగా వినియోగిస్తే అధిక రక్తస్రావం, గర్భస్రావం పూర్తికాకపోవడం, ఇన్‌ఫెక్షన్ వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని టీజీ సేఫ్ హెచ్చరించింది.
డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ జీ. అశ్విని, ఖమ్మం అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. అరవింద్ కుమార్ పర్యవేక్షణలో ఈ దాడి నిర్వహించారు. అధికారులు కిట్ల నమూనాలను సేకరించి విశ్లేషణకు పంపించారు. తదుపరి దర్యాప్తు అనంతరం బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనధికారికంగా ఎంటీపీ కిట్లను కొనుగోలు చేయడం, విక్రయించడం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం శిక్షార్హమని, నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
