Let's talk: editor@tmv.in
భద్రతా బలగాల పంజా

భద్రతా బలగాల పంజా

Panthagani Anusha
28 సెప్టెంబర్, 2025

చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా, నక్సలైట్ కార్యకలాపాలకు కేంద్రమైన బాస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఎప్పటికప్పుడూ రక్షణ సిబ్బందికి పెద్ద సవాలు అవుతున్నాయి. కాగా ఇటీవల ఈ ప్రాంతంలో మావోయిస్టులు గుంపుగా ఏర్పడి భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఆయుధాలు, పేలుడు పదార్థాలను భారీగా తయారు చేస్తూన్నా నేపథ్యంలో చత్తీస్‌గఢ్ పోలీసులు సుక్మా జిల్లా అడవులలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మావోయిస్టుల స్థావరమైన పెద్ద ఆయుధ కర్మాగారాన్ని ధ్వంసం చేశారు.

ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా, సుక్మా జిల్లా పోలీసు సిబ్బంది ప్రత్యేక క్రిమినల్ దళం కలిసి కోమెంటా గ్రామం సమీపంలోని అడవి కొండపై మావోయిస్టుల తయారీ కేంద్రాన్ని గుర్తించి ఆపరేషన్ నిర్వహించారు. ఈ కేంద్రం నిషేధిత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్)కి చెందినది.

పోలీసుల వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో ఒక సెంట్రల్ మిల్లింగ్ యంత్రం, రెండు బారెల్ గ్రెనేడ్ లాంచర్లు, 12 ఖాళీ షెల్స్, 94 హెడ్‌లు, ఒక చేతి గ్రైండర్ యంత్రం, ఆరు రైఫిల్ బట్స్, మజిల్ లోడర్ కోసం ఒక ట్రిగ్గర్ యంత్రం, పిస్టల్ గ్రిప్‌తో ఒక ట్రిగ్గర్, నాలుగు సౌర బ్యాటరీలు, ఒక 10 అడుగుల బోర్వెల్ డ్రిల్లింగ్ బిట్, రెండు గ్యాస్ కట్టర్ హెడ్‌లు, ఆరు ఇనుము కట్టర్ చక్రాలు, 80 ఇనుము పైపు ముక్కలు, ఇతర వస్తువులు ఉన్నాయి.

ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన తర్వాత భద్రతా బలగాల సిబ్బంది సురక్షితంగా మేటగూడా శిబిరానికి తిరిగి చేరుకున్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి శోధన చర్యలను మరింత తీవ్రంగా కొనసాగిస్తామని, నిరంతర ఆపరేషన్ల వలన మావోయిస్టుల బలగాలు రోజురోజుకు బలహీనమవుతున్నాయని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

ఇకపోతే చత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో 249 మంది మావోయిస్టులు హతమయ్యారు. ముఖ్యంగా మావోయిస్టుల అగ్రనేత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణం మావోయిస్టు శక్తికి గట్టి దెబ్బ అని పోలీసులు పేర్కొన్నారు.

అధికారుల అంచనా ప్రకారం, మావోయిస్టు కార్యకలాపాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో భయపెట్టే స్థాయిలో ఉన్న మావోయిస్టులు, ఇప్పుడు రక్షణ దళాల నిరంతర ఆపరేషన్ల వలన బలహీనపడి చిన్నచిన్న దాడులకు మాత్రమే పరిమితమవుతున్నారని చెబుతున్నారు. అయినప్పటికీ, బస్తర్ ప్రాంతంలో ఇంకా విస్తృతంగా వారి ప్రభావం కొనసాగుతుండటంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా పనిచేస్తున్నాయి.

భద్రతా బలగాల పంజా - Tholi Paluku