Let's talk: editor@tmv.in
భద్రతపై రాజీ లేదు: కేంద్ర మంత్రి రాం మోహన్ నాయుడు

భద్రతపై రాజీ లేదు: కేంద్ర మంత్రి రాం మోహన్ నాయుడు

Pinjari Chand
9 డిసెంబర్, 2025

ప్రయాణికుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారాపు రాం మోహన్ నాయుడు సోమవారం రాజ్యసభలో ఇండిగో ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై స్పందించారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కారణం విమానయాన సంస్థ అంతర్గత క్రూ రోస్టరింగ్, ఆపరేషనల్ ప్లానింగ్ సమస్యలేనని, ఇది ఏయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, షెడ్యూలింగ్ సిస్టమ్ తో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభలో మాట్లాడిన ఆయన విమానాల ఆలస్యం, రద్దుల వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కఠినమైన సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ ఉన్నాయని, వీటిని విమానయాన సంస్థలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.

సాఫ్ట్‌వేర్ సమస్యపై దర్యాప్తు జరుగుతోంది

ఈ రంగంలో సాంకేతిక అప్‌గ్రేడేషన్ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దేశంలో ప్రపంచ స్థాయి విమానయాన ప్రమాణాలు నెలకొల్పడమే మా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తెలిపారు. ఇండిగోలో ఎదురవుతున్న సమస్యలు క్రూ రోస్టరింగ్, రోజువారీ ఆపరేషనల్ ప్లానింగ్‌కు సంబంధించినవేనని, ఇవన్నీ విమానయాన సంస్థ బాధ్యతలోని విషయాలేనని ఆయన వివరించారు. ఫ్లైట్ టైమ్ లిమిటేషన్స్ మార్గదర్శకాలపై అన్ని వాటాదారులతో విస్తృత చర్చలు జరిపామని, సురక్షతపై రాజీ ఉండబోదని మరోసారి స్పష్టం చేశారు. ఏ ఆపరేటర్ అయినా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆయన విమానయాన రంగంలో మరింత మంది వ్యాపారవేత్తలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు.

రాజ్యసభ సభ్యుడు ఎం. తంబి దురై ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి, గంటల తరబడి విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు అమాంతంగా పెరిగిన ఛార్జీల గురించి ప్రస్తావించగా, జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేశారు.

ఛార్జీలకు పరిమితులు విధించాం

5 లక్షలకు పైగా పీఎన్ఆర్ లు రద్దయ్యాయి, దాదాపు రూ.569 కోట్లు ప్రయాణికులకు తిరిగి చెల్లించాం. ఛార్జీలకు పరిమితి విధించాం, నాలుగు స్లాబ్‌లు ఏర్పాటు చేశాం. అత్యధిక ఛార్జీలకు అడ్డుకట్ట వేయడానికి గతంలోనూ కఠిన చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఇండిగో నెట్‌వర్క్‌లో కొనసాగుతున్న విమాన ఆలస్యాలు, రద్దులతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ చర్చ జరిగింది.

మరోవైపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిసెంబర్ 6న జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వడానికి ఇండిగో అకౌంటబుల్ మేనేజర్, సీఈఓకి ఒక్కసారి మాత్రమే 24 గంటల గడువు పొడిగించింది. దేశవ్యాప్త నెట్‌వర్క్ పరిమాణం, అనివార్య కారణాలు ఉన్నాయని సంస్థ అధిక సమయం కోరింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే గడువును డీజీసీఏ పొడిగించింది. ఇంకా పొడిగింపులు ఉండవని స్పష్టం చేసింది.

భద్రతపై రాజీ లేదు: కేంద్ర మంత్రి రాం మోహన్ నాయుడు - Tholi Paluku