Let's talk: editor@tmv.in
భక్తుల విశ్వాసాన్ని కాపాడుతూ సేవలు మరింత మెరుగుపరచాలి: సీఎం

భక్తుల విశ్వాసాన్ని కాపాడుతూ సేవలు మరింత మెరుగుపరచాలి: సీఎం

Panthagani Anusha
23 మార్చి, 2026

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సేవలందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతను జోడించి అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు తక్కువ సమయంలో స్వామివారి దర్శనం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రసాదాల తయారీలో వాడే నెయ్యి, ఇతర ముడి పదార్థాల నాణ్యతను నిరంతరం పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక ల్యాబ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండకూడదని తాను స్వయంగా భక్తులను కలిసినప్పుడు వారు ప్రసాదం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారని ఆ నమ్మకాన్ని నిరంతరం కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. క్యూలైన్లలో భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఏఐ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాలని తద్వారా రద్దీని క్రమబద్ధీకరించి వేచి ఉండే సమయాన్ని తగ్గించాలని సూచించారు.

పేదల సేవయే పరమాత్మ సేవగా భావించి టీటీడీ అనుబంధ వైద్య సంస్థలైన స్విమ్స్, బర్డ్, ఎస్పీసీహెచ్‌సీలలో వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. అయితే అరుదైన కేసుల చికిత్స కోసం ప్రాణదానం ట్రస్ట్ ద్వారా టీటీడీ బడ్జెట్‌లో నెలకు మరో కోటి రూపాయల అదనపు నిధులను సమకూరుస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చారు. అదేవిధంగా ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ప్రస్తుతం 57 దేవాలయాల్లో జరుగుతున్న అన్నప్రసాద వితరణను మరో నాలుగు ప్రధాన ఆలయాలకు విస్తరించాలని నిర్ణయించారు. తిరుమల కొండపై శ్రీవారి సేవకుల సేవలను అన్ని విభాగాల్లో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.

మరోవైపు హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 750 కోట్లతో సుమారు 5 వేల నూతన ఆలయాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ తిరుమల శ్రీవారి ఆలయ నమూనాలో భవ్యమైన ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, పలువురు ప్రజా ప్రతినిధులు, టీటీడీ ఉన్నతాధికారులు, తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ పాల్గొన్నారు.