Let's talk: editor@tmv.in
భక్తుల భద్రతకు రోబోటిక్ డాగ్‌.. శేషాచలంలో వన్యప్రాణులపై నిఘా

భక్తుల భద్రతకు రోబోటిక్ డాగ్‌.. శేషాచలంలో వన్యప్రాణులపై నిఘా

Pinjari Chand
22 ఆగస్టు, 2026

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పరిసర అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధునాతన రోబోటిక్ డాగ్‌ను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తోంది. భక్తుల భద్రతను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో చె. వెంకయ్య చౌదరితో పాటు ఇతర అధికారులు క్వాడ్రుపెడ్ రోబోట్‌ (రోబోటిక్ డాగ్‌) పనితీరును పరిశీలించారు. ఈ రోబోటిక్ డాగ్‌లో ఆప్టికల్, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలతో పాటు 360 డిగ్రీల లైడార్, పలు సెన్సర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికత ఉన్నాయి. చీకటి, పొగమంచు వంటి తక్కువ దృశ్యమానత ఉన్న పరిస్థితుల్లోనూ వన్యప్రాణులను గుర్తించి వాటి కదలికలను ట్రాక్ చేసే సామర్థ్యం దీనికి ఉంది.

ఏఐ వ్యవస్థ ద్వారా పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పెంపుడు జంతువులను గుర్తించవచ్చు. వన్యప్రాణుల కదలికలను గుర్తించిన వెంటనే జియో-ట్యాగ్‌డ్ అలర్ట్‌లు పంపడంతో పాటు ప్రత్యక్ష వీడియో, థర్మల్ ఫీడ్‌ను కంట్రోల్‌ రూమ్‌, గస్తీ సిబ్బందికి పంపుతుంది. దీంతో అధికారులు తక్షణమే స్పందించే అవకాశం ఉంటుంది.

భక్తులను అప్రమత్తం చేయడంలో..

ముఖ్యంగా అలిపిరి–తిరుమల కాలినడక మార్గానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణులను ముందుగానే గుర్తించి భక్తులను అప్రమత్తం చేయడంలో ఈ రోబోటిక్ డాగ్‌ ఉపయోగపడుతుందని టీటీడీ భావిస్తోంది. అలాగే రోబోట్‌లోని శబ్ద, కాంతి పరికరాలను ఉపయోగించి భక్తుల ప్రాంతాల నుంచి వన్యప్రాణులను భౌతికంగా తాకకుండా దూరంగా పంపించే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలించారు. తద్వారా మనిషి–వన్యప్రాణి మధ్య ప్రత్యక్ష ఘర్షణలను నివారించవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ రోబోటిక్ డాగ్‌ ఇప్పటికే ఉన్న కెమెరా ట్రాప్‌లు, కాలినడక గస్తీ, అటవీ నిఘా వ్యవస్థలకు ప్రత్యామ్నాయం కాదని, వాటికి అదనంగా మొబైల్‌ మానిటరింగ్‌ సాధనంగా ఉపయోగించనున్నట్లు టీటీడీ తెలిపింది. వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దీనిని త్వరగా తరలించి నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. రోబోట్‌ ద్వారా సేకరించే వీడియోలు, థర్మల్‌ చిత్రాలు, కదలికల సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వన్యప్రాణుల సంచార తీరును మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడంతో పాటు కీలక ప్రాంతాల్లో గస్తీ, నిఘా ఏర్పాట్లను సమర్థవంతంగా ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటుందని టీటీడీ పేర్కొంది. తిరుమల అటవీ ప్రాంతాల్లో గతంలో చిరుతల దాడులకు భక్తులు, ముఖ్యంగా చిన్నారులు గురైన ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో వన్యప్రాణుల పర్యవేక్షణకు రోబోటిక్‌ సాంకేతికతను వినియోగించే అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.