
భక్తులతో గౌరవంగా ప్రవర్తించాలి
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులతో ట్యాక్సీ డ్రైవర్లు మర్యాదగా ప్రవర్తించి మన్ననలు అందుకోవాలని తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు సూచించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రాకపోకలకు అనుసంధానంగా ప్రైవేట్ ట్యాక్సీ డ్రైవర్లతో ఎస్పీ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ట్యాక్సీ డ్రైవర్లకు ముఖ్య సూచనలు చేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా చూసుకోవాలన్నారు. గరుడ సేవ రోజు భక్తుల రద్దీ అధికంగా ఉన్న దృష్ట్యా, భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు.
ప్రతి వాహనం తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని అదేశించారు. వాహనాలను పరిమిత వేగంగా నడుపుతూ టీటీడీ, పోలీసుల సూచనలు, నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించినట్లయితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించిన విధంగా మాత్రమే ట్యాక్సీ ఛార్జీలు పెద్దలకు రూ.110, చిన్నపిల్లలకు రూ.60 వసూలు చేయాలని సూచించారు. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే డయల్ 112 ద్వారా పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పి రామకృష్ణ, డియస్పి విజయశేఖర్, ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్ ఇతర అధికారులు, డ్రైవర్లు పాల్గొన్నారు.
