Let's talk: editor@tmv.in
‘బ్లూ డ్రమ్’హత్య కేసు నిందితురాలు ముస్కాన్ కు ఆడబిడ్డ జననం

‘బ్లూ డ్రమ్’హత్య కేసు నిందితురాలు ముస్కాన్ కు ఆడబిడ్డ జననం

Pinjari Chand
28 నవంబర్, 2025

దేశంలో సంచలనం రేపిన బ్లూ డ్రమ్​ హత్య కేసు నిందితురాలు ముస్కాన్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భర్తను దారుణంగా హత్య చేసి, బ్లూ డ్రమ్‌లో సిమెంట్ పోసి దాచిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ముస్కాన్‌ నవంబరు 24న లాలా లజపత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీలో పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. బుధవారం సాయంత్రం ఆమెను డిశ్చార్జ్ చేసిన అనంతరం, గురువారం ఆ బిడ్డతో పాటు మీరట్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారని జైలు అధికారులు తెలిపారు. జైలు సూపరింటెండెంట్ వీరేశ్ రాజ్ శర్మ మాట్లాడుతూ ముస్కాన్ ఇక్కడికి మార్చిలో వచ్చింది. ఆమె ఇక్కడికి వచ్చే నాటికే గర్భవతి గా ఉంది. బిడ్డ పుడితే జైలులో రాధ అని పేరు పెడతారని, బాలికకు జైలు పరిసర ప్రాంగణంలోనే టీకాలు వేస్తామన్నారు. ఇప్పటి వరకు ఎవరూ రాతపూర్వకంగా డీఎన్‌ఏ టెస్ట్ కోరలేదని, అందుకే ఆ పరీక్ష చేపట్టలేదని చెప్పారు. దివంగత భర్త సౌరభ్ రాజ్‌పుత్ కుటుంబ సభ్యులు మాత్రం బిడ్డ తండ్రి ఎవరో నిర్ధారించేందుకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించాలని మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే.

జైలులోని బ్యారక్ 12ఏకు ముస్కాన్ తరలింపు

ఈ బ్యారక్‌లో ఇప్పటికే 21 మంది మహిళా ఖైదీలు, వారితోపాటు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ముస్కాన్ రాగానే ఇతర మహిళా ఖైదీలు ఆమెకు, బిడ్డకు శుభాకాంక్షలు తెలిపినట్టు జైలు వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు ముస్కాన్ లేదా సౌరభ్ కుటుంబం నుంచి ఎవరూ బిడ్డను చూడ్డానికి జైలుకు రాలేదు. ఆమె తల్లిదండ్రులు ప్రమోద్ రస్తోగి, కవిత దంపతులు ముస్కాన్ ముందు కూతురు పీహూను పోషిస్తున్నారు. జైలు వైద్యులు తల్లి-బిడ్డ ఆరోగ్యాన్ని క్రమంగా పర్యవేక్షిస్తారని, ముస్కాన్‌కు పోషకాహారం అందిస్తున్నామని సూపరింటెండెంట్ తెలిపారు. ఒక నెల వరకు ఆమెకు ఎలాంటి పని కేటాయించబోమని, తర్వాత సాధారణ పనులు అప్పగిస్తామని చెప్పారు. బిడ్డ కోసం జైలులో పర్యవేక్షణ ఉంటుందని , ఆమెను జైలు ఆంగన్‌వాడీలో నమోదు చేస్తామని, తల్లి-బిడ్డకు అవసరమైన సామగ్రిని జైలు మాన్యువల్ ప్రకారం సమకూరుస్తామని ఆయన వివరించారు. మార్చి 4న మీరట్ ఇందిరానగర్‌లోని ఇంట్లో సౌరభ్ రాజ్‌పుత్‌ను ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి హత్య చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, నీలం రంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో సిమెంట్ పోసి దాచినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. తర్వాత ఇద్దరూ హిమాచల్ ప్రదేశ్‌కు పరారయ్యారు. ముస్కాన్ తర్వాత తన కుటుంబానికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి వీరిని అరెస్ట్ చేశారు.

‘బ్లూ డ్రమ్’హత్య కేసు నిందితురాలు ముస్కాన్ కు ఆడబిడ్డ జననం - Tholi Paluku