
బ్లాక్ బాక్స్ కాలిపోయిందా?: బారామతి విమాన ప్రమాదంపై సంజయ్ రౌత్ అనుమానం
మహారాష్ట్రలో జనవరి 28న బారామతిలో జరిగిన విమాన ప్రమాదంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అనుమానాలు వ్యక్తం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో విమానంలోని బ్లాక్ బాక్స్ కాలిపోయిందన్న సమాచారం ‘రహస్యంగా, అత్యంత అనుమానంగా’ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అజిత్ పవార్ ప్రయాణించిన విమాన బ్లాక్ బాక్స్ కాలిపోయిందని చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యం? 20 ఏళ్ల తర్వాత కూడా బ్లాక్ బాక్స్‌లు దొరుకుతాయి. కానీ ఈ ఘటనలో అది కాలిపోయిందంటే ఇది తీవ్రమైన విషయమని అన్నారు. పవార్ కుటుంబ సభ్యుడు రోహిత్ పవార్ వ్యక్తం చేసిన అనుమానాలకు ఆయన మద్దతు తెలిపారు. రౌత్ ప్రకారం, ఈ అంశంపై పవార్ కుటుంబం స్వతంత్రంగా విచారణ కోరితే ప్రభుత్వం సహకరించాలన్నారు. ఈ కేసులో ప్రభుత్వ ఉద్దేశాలు సరిగా లేవనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
మొత్తం మహారాష్ట్ర ప్రశ్నిస్తోంది
ఇదిలా ఉండగా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్ వర్గం) నాయకుడు రోహిత్ పవార్ ఈ ప్రమాదం కేవలం ప్రమాదం మాత్రమేనా? లేక కుట్ర కోణమా? అనే సందేహాలు వ్యక్తం చేశారు. బారామతిలో జరిగిన లియర్‌జెట్ 45 ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరికొందరు మరణించిన విషయం తెలిసిందే. రోహిత్ పవార్ మాట్లాడుతూ అజిత్ దాదా విమాన ప్రమాదం ప్రమాదమా లేక కుట్రనా అని మొత్తం మహారాష్ట్ర ప్రశ్నిస్తోంది. నాకు అనిపించిన దానిని మీ అందరితో పంచుకుంటున్నాను. కొంతమంది ఇప్పటికీ దాదా ఎక్కడి నుంచో తిరిగి వస్తారని ఆశిస్తున్నారు. కొందరు విమానంలో ఆరుగురు ఉన్నారని, అది అజిత్ దాదా మృతదేహం కాదని అంటున్నారు. ఇది ఇప్పటికీ ఒక పీడకలలా అనిపిస్తోంది’ ప్రమాదానికి ముందు చివరి 24 గంటల్లో జరిగిన మార్పులు అనుమానాస్పదంగా ఉన్నాయని అన్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం నెలకొన్న అనుమానం, దుఃఖం, రాజకీయ ఊహాగానాల వాతావరణాన్ని ఆయన ప్రస్తావించారు. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవాలంటే అతని డ్రైవర్‌ను చంపడం సులభమైన మార్గమని పేర్కొన్న పుస్తకాన్ని ఉటంకిస్తూ, ప్రమాదంపై లోతైన దర్యాప్తు అవసరమని సూచించారు. అజిత్ పవార్ ముంబై నుంచి పుణేకు కారులో రావాల్సి ఉండగా, భద్రతా వాహనాల కాన్వాయ్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన ప్రయాణం మారిందని రోహిత్ తెలిపారు. చివరి నిమిషంలో ఒక ‘పెద్ద నాయకుడితో’ సమావేశం కారణంగా ప్రణాళిక మారి ఉండవచ్చని పేర్కొన్నారు. జనవరి 28న ముంబై నుంచి బారామతికి వెళ్తున్న చార్టర్డ్ విమానం రన్‌వే వద్ద కూలిపోయిందని డీజీసీఏ తెలిపింది. ఈ ప్రమాదంలో సిబ్బంది సహా ఐదుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై వైమానిక అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బారామతి లియర్‌జెట్ ప్రమాదంపై ఏఏఐబీ దర్యాప్తు అప్డేట్
బారామతిలో జరిగిన లియర్‌జెట్ 45 (వీటీ-ఎస్ఎస్కే) విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇది 2017 నాటి విమాన ప్రమాదాల దర్యాప్తు నిబంధనలు, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జరుగుతోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ విమానంలో రెండు స్వతంత్ర ఫ్లైట్ రికార్డర్లు అమర్చారు. ప్రమాద సమయంలో తీవ్ర అగ్ని ప్రమాదానికి గురవడంతో రెండూ దెబ్బతిన్నాయి. ఎల్3-కమ్యూనికేషన్ తయారు చేసిన డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (డీఎఫ్డీఆర్ ) ను ఏఏఐబీ ఫ్లైట్ రికార్డర్ ల్యాబ్‌లో విజయవంతంగా డౌన్‌లోడ్ చేశారు.హనీవెల్ తయారు చేసిన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) పై సాంకేతిక పరీక్షలు కొనసాగుతున్నాయి. డేటా రికవరీ కోసం తయారీ దేశ ప్రతినిధి సహాయం కోరారు. ఏఏఐబీ పారదర్శకతతో, సాంకేతిక ప్రమాణాల ప్రకారం దర్యాప్తు కొనసాగిస్తోందని పేర్కొంది. ఊహాగానాలకు తావు ఇవ్వకుండా దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాలని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేసింది.
