
బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించాలి : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మహిళల ఆరోగ్యానికి పెను సవాలుగా మారుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్) పట్ల సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నెల్లూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) పద్మావతి ఆడిటోరియంలో 'బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా' ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సెమినార్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి, ఇతర కారణాల వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమని అన్నారు. అయితే ఈ వ్యాధి పట్ల భయం కన్నా అవగాహన ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. "బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాణాంతకమైనదే కావచ్చు కానీ ప్రాథమిక దశలోనే దీనిని గుర్తిస్తే ఆధునిక వైద్యం ద్వారా 90 శాతం వరకు పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉన్నాయి" అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మహిళలు క్రమం తప్పకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా తమ ప్రాణాలను రక్షించుకోవచ్చని సూచించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు అవగాహన లేక వ్యాధి ముదిరే వరకు ఆసుపత్రులకు రావడం లేదని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. "వైద్యం కన్నా నివారణే మిన్న అనే నినాదాన్ని పల్లె పల్లెకూ తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి, గ్రామీణ మహిళల్లో ఉన్న అపోహలను తొలగించి వారిని చైతన్య పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు, ఆరోగ్య కార్యకర్తలు స్విమ్స్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
