Let's talk: editor@tmv.in
బ్రెజిల్‌లో లిథియం గనుల భాగస్వామ్యానికి సింగరేణిని ఆహ్వానించిన సిబిఎల్

బ్రెజిల్‌లో లిథియం గనుల భాగస్వామ్యానికి సింగరేణిని ఆహ్వానించిన సిబిఎల్

Dantu Vijaya Lakshmi Prasanna
27 ఫిబ్రవరి, 2026

బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ లిథియం గనుల సంస్థ కంపాన్హియా బ్రసిలీరా డి లిటియో (సిబిఎల్) సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌తో భాగస్వామ్యంపై ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సిబిఎల్ కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. బలరాంను కలసి, బ్రెజిల్‌లో లిథియం గనుల కార్యకలాపాల్లో భాగస్వామిగా చేరాలని అధికారికంగా ఆహ్వానించింది. ఈ సమావేశం రెండు దేశాల మధ్య ఖనిజ రంగంలో సహకారానికి కొత్త దారులు తెరవనుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సంస్థ బోర్డు డైరెక్టర్ డానియల్ లేమె, ప్రధాన కార్యనిర్వాహక అధికారి వినీసియస్ అల్వరెంగా, సింగరేణి అధికారులకు తమ సంస్థ చేపడుతున్న లిథియం గనుల ప్రాజెక్టులు, ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై సవివరంగా వివరించారు. బ్రెజిల్‌లో లిథియం తవ్వకం, శుద్ధి, సరఫరా వ్యవస్థలను మరింత విస్తరించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంతో భాగస్వామ్యం ఉంటే దీర్ఘకాలికంగా బలమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని వారు అభిప్రాయపడ్డారు.

లిథియం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలక ఖనిజంగా మారిందని ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక శక్తి నిల్వ వ్యవస్థలు, ఆధునిక బ్యాటరీలు, సాంకేతిక పరికరాల తయారీలో లిథియం వినియోగం వేగంగా పెరుగుతోందని వివరించారు. భవిష్యత్తులో లిథియం అవసరం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో, ముందుగానే వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడం అవసరమని తెలిపారు. ఇదే క్రమంలో లిథియం గనులు మరియు సరఫరా వ్యవస్థలపై భాగస్వామ్యాల కోసం పలు భారతీయ సంస్థలతో ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

సింగరేణి తరఫున డైరెక్టర్ (ప్రాజెక్టులు, ప్రణాళికలు) కే వేంకటేశ్వరులు, డై రెక్టర్ (సిబ్బంది, ఆర్థిక విభాగం) గౌతమ్ పొట్రు సంస్థ బలాలను వివరించారు. బొగ్గు గనుల రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న సింగరేణి, భవిష్యత్తులో కీలక ఖనిజాల రంగంలోకి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. బ్రెజిల్‌లో లిథియం గనుల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావడం సాంకేతికంగా సాధ్యమా, వాణిజ్యపరంగా లాభదాయకమా, వ్యూహాత్మకంగా సంస్థకు ఎంత మేర ప్రయోజనం ఉంటుందనే అంశాలను సవివరంగా అధ్యయనం చేసిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు.

బ్రెజిల్‌లో లిథియం గనుల భాగస్వామ్యానికి సింగరేణిని ఆహ్వానించిన సిబిఎల్ - Tholi Paluku