Let's talk: editor@tmv.in
బ్రిటిష్ పాలకుల్లా వ్యవహరించొద్దు: మమతా బెనర్జీ

బ్రిటిష్ పాలకుల్లా వ్యవహరించొద్దు: మమతా బెనర్జీ

Pinjari Chand
3 డిసెంబర్, 2025

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంపై బలవంతంగా ఆదేశాలు రుద్దుతూ బ్రిటిష్ పాలకుల్లా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎన్నడూ నిర్బంధ శిబిరాలను అనుమతించదని, మత రాజకీయాలను చేయదని స్పష్టం చేశారు.

కేంద్రం రాష్ట్రాలను అస్థిర పరిచే కుట్ర చేస్తోంది

రాష్ట్ర సచివాలయం నబన్నలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ గత 14.5 సంవత్సరాలుగా తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. బీజేపీ తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రారంభించిందని, ఎన్నికల సంస్కరణల పేరుతో రాష్ట్రాలను అస్థిరపరచాలని కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బెంగాల్‌లో డిటెన్షన్ క్యాంపులు నడపం. ప్రజలను హింసించం. మేము ఎవరినీ ఇబ్బంది పెట్టం... అయినా కేంద్రం ఎందుకు రాష్ట్రాలను ఇబ్బంది పెడుతోంది? అని ప్రశ్నించారు. కేంద్రం బ్రిటిష్ పాలకుల్లా ప్రవర్తించొద్దని హెచ్చరించిన మమతా మీకు ఏదైనా చెప్పాలని ఉంటే, రాష్ట్రానికి నేరుగా చెప్పండి. మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని ఆమె అన్నారు. బ్రిటిష్ వారి తరహాలో బలవంతంగా రుద్దడం సబబు కాదన్నారు. నేను మత రాజకీయాలు చేయను. మతేతర రాజకీయాలే నా బాట. నాకు అన్ని మతాలూ సమానమే అని స్పష్టం చేశారు.

2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటరు జాబితా ప్రక్షాళన చేయడం, మరణించిన, వలస వెళ్లిన ఓటర్లను తొలగించడం లక్ష్యంగా ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఆదేశించిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు కారణమవుతోంది. బీజేపీ-టీఎంసీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈసీఐ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఓటరు జాబితాలపై ప్రభావం చూపాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మమతా ఆరోపించారు.

ఎవరిపై వివక్ష చూపం

రాజ్యాంగ విలువలు, సమాఖ్య వ్యవస్థ రక్షకుడిగా తమ ప్రభుత్వాన్ని పేర్కోనారు. బెంగాల్ ఎవరిపై వివక్ష చూపదు. అన్ని సముదాయాలనూ సమానంగా చూస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజలను విభజించేది కాదు, అందరినీ కాపాడేదని చెప్పారు. వారం రోజులుగా కోల్‌కతాలోని సీఈఓ కార్యాలయం ముందు బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓ) భారీగా నిరసనలు చేశారు. అమానుషమైన పని భారం అంటూ పోలీసులతో ఘర్షణలు కూడా జరిగాయి.

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వంటి పౌరసత్వ చట్టాలను కూడా మమతా పరోక్షంగా లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. ఎవరినీ రాష్ట్ర నుంచి బహిష్కరించే లేదా డిటెన్షన్ క్యాంపుల్లో పడేసే ఏ చట్టాన్నీ బెంగాల్‌లో అమలు చేయనివ్వం అని హెచ్చరించారు. మమతా ప్రసంగం అనంతరం బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. ఓటరు జాబితా సవరణకు మమత భయపడుతోంది. వేలాది ఫేక్, అక్రమ ఓటర్లను టీఎంసీ ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిందని ఆరోపించారు. కేంద్రాన్ని బ్రిటిష్‌తో పోల్చడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానమని, మమతా లౌకిక రాజకీయాలు అనేది కేవలం నాటకమేనని, ఓటు బ్యాంకు కోసం ఆమె బుజ్జగింపు రాజకీయాలే చేస్తోందని విమర్శించారు.

బ్రిటిష్ పాలకుల్లా వ్యవహరించొద్దు: మమతా బెనర్జీ - Tholi Paluku