Let's talk: editor@tmv.in
బ్రిటన్ జలాల్లో రష్యా సబ్‌మెరైన్ల కలకలం!
బ్రిటన్ జలాల్లో రష్యా సబ్‌మెరైన్ల కలకలం!

బ్రిటన్ జలాల్లో రష్యా సబ్‌మెరైన్ల కలకలం!

Shaik Mohammad Shaffee
10 ఏప్రిల్, 2026

బ్రిటన్ సముద్ర జలాల్లో రష్యాకు చెందిన అటాక్ జలాంతర్గాములు రహస్యంగా సంచరించడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. సముద్ర గర్భంలోని కీలక మౌలిక సదుపాయాలను దెబ్బతీసే లక్ష్యంతో రష్యా చేపట్టిన ఈ 'నిగూఢ' ఆపరేషన్లను బ్రిటన్ సాయుధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడును అడ్డుకోవడానికి, తమ దేశ భద్రతను కాపాడుకోవడానికి ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడబోమని బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మభ్యపెట్టే వ్యూహం.. అసలు లక్ష్యం వేరే!

కొన్ని వారాల క్రితం నార్త్ అట్లాంటిక్ మీదుగా ఒక రష్యన్ అటాక్ జలాంతర్గామి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించినట్లు బ్రిటన్ నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే ఇది కేవలం బ్రిటన్ దృష్టిని మళ్లించడానికి రష్యా పన్నిన 'బ్లఫ్' (మభ్యపెట్టే ఎత్తుగడ) అని సాయుధ దళాలు త్వరగానే గ్రహించాయి. ఒకవైపు అటాక్ జలాంతర్గామి అలజడి సృష్టిస్తుండగా, మరోవైపు రష్యాకు చెందిన మెయిన్ డైరెక్టరేట్ ఆఫ్ డీప్ సీ రీసెర్చ్ (జీయూజీఐ) విభాగానికి చెందిన ప్రత్యేక నౌకలు సముద్రగర్భంలోని కీలక మౌలిక సదుపాయాల వద్ద అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడినట్లు రక్షణ శాఖ నిర్ధారించింది.

ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టే పన్నాగం

ప్రపంచవ్యాప్తంగా 99 శాతం డేటా ట్రాఫిక్, ఇంటర్నెట్, బ్యాంకింగ్, వాణిజ్య కార్యకలాపాలకు వెన్నెముకగా నిలిచే 'సబ్‌సీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్'ను లక్ష్యంగా చేసుకుని రష్యా ఈ కుట్రకు పూనుకున్నట్లు బ్రిటన్ భావిస్తోంది. సాధారణ సమయంలో ఈ కేబుల్స్‌పై నిఘా ఉంచి, యుద్ధం వంటి పరిస్థితుల్లో వాటిని ధ్వంసం చేయడం ద్వారా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే రష్యా జీయూజీఐ విభాగం ముఖ్య ఉద్దేశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా చేపట్టిన ఈ చర్యలను బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ తీవ్రంగా ఖండించారు.

నేవీ, ఎయిర్ ఫోర్స్ నిరంతర పహారా

రష్యా జలాంతర్గామి కదలికలను కనిపెట్టడానికి బ్రిటన్ తన రాయల్ నేవీకి చెందిన హెచ్‌ఎంఎస్ సెయింట్ అల్బన్స్ యుద్ధనౌకతో పాటు ఆర్‌ఎఫ్ఏ టైడ్‌స్పింగ్, మెర్లిన్ హెలికాప్టర్లను రంగంలోకి దించింది. నార్వే వంటి మిత్రదేశాల సహకారంతో పి8 సబ్‌మెరైన్ హంటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌‌లను ఉపయోగించి 24 గంటల పాటు నిఘా ఏర్పాటు చేశారు. సముద్ర గర్భంలో శత్రు నౌకల జాడను పసిగట్టే ‘సోనోబాయ్స్'ను మొహరించి, వేల మైళ్ల మేర రష్యా నౌకలను వెంబడించారు. తాము నిరంతరం నిఘా నీడలో ఉన్నామని గ్రహించిన రష్యాకు చెందిన 'అకులా క్లాస్' జలాంతర్గామి, ఇతర నౌకలు తమ ప్రయత్నాన్ని విరమించుకుని వెనుదిరిగాయి.

సముద్ర గర్భంలో 'నిశ్శబ్ద యుద్ధం'

బ్రిటన్ జలాల్లో రష్యా ఇలాంటి రహస్య గూఢచర్యానికి పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. గత పదేళ్లుగా రష్యాకు చెందిన 'యంతార్' వంటి గూఢచారి నౌకలు బ్రిటన్, నాటో దేశాల తీర ప్రాంతాల్లో పదే పదే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2017లో ఒక రష్యా నౌక అనుమానాస్పదంగా సంచరించినప్పుడు బ్రిటన్ దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. కేవలం నిఘా పెట్టడమే కాకుండా, సముద్రం అడుగున ఉండే గ్యాస్ పైప్‌లైన్లు, ఇంటర్నెట్ కేబుల్స్ ఎక్కడ ఉన్నాయో పక్కాగా మ్యాపింగ్ చేయడం రష్యా ప్రధాన ఉద్దేశం. 'హైబ్రిడ్ వార్‌ఫేర్'లో భాగంగా నేరుగా యుద్ధం చేయకుండా శత్రువును దెబ్బతీయడమే పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది.

భద్రతపై రాజీ పడం: ప్రధాని స్టార్మర్

బ్రిటన్ ప్రజల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధాని కైర్ స్టార్మర్ ఉద్ఘాటించారు. "పుతిన్ దూకుడుకు మా ప్రజలు మూల్యం చెల్లించడాన్ని నేను సహించను. మా సాయుధ దళాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రష్యా ముప్పును ఎదుర్కోవడానికి, పి8 నిఘా విమానాల సామర్థ్యాన్ని పెంచడానికి అదనంగా 100 మిలియన్ పౌండ్ల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రష్యా జలాంతర్గాములు వెనుదిరిగినప్పటికీ, బ్రిటన్ దళాలు హై అలర్ట్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.