Let's talk: editor@tmv.in
బ్రిటన్ ఎంపీ తులిప్ సిద్ధిక్‌ అరెస్ట్‌కు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించండి: బంగ్లా కోర్టు

బ్రిటన్ ఎంపీ తులిప్ సిద్ధిక్‌ అరెస్ట్‌కు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించండి: బంగ్లా కోర్టు

Shaik Mohammad Shaffee
27 ఫిబ్రవరి, 2026

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సోదరి కుమార్తె, బ్రిటీష్ ఎంపీ తులిప్ సిద్ధిక్‌కు ఉచ్చు బిగుస్తోంది. ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతి కేసులో ఆమెను అరెస్టు చేసేందుకు ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ నోటీసు జారీ చేయించాలని ఢాకా కోర్టు గురువారం అధికారులను ఆదేశించింది. లండన్‌లోని హంప్‌స్టెడ్, హైగేట్ నియోజకవర్గాల నుంచి ఎంపీగా ఉన్న తులిప్ సిద్ధిక్‌.. బంగ్లాదేశ్ అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల్లో ప్రధాన నిందితురాలిగా ఉన్నారు.

షేక్ హసీనా అండతో అక్రమ భూ కేటాయింపులు!

షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో తులిప్ సిద్ధిక్‌ తన పలుకుబడిని ఉపయోగించి భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఢాకాలోని అత్యంత ఖరీదైన గుల్షన్ ప్రాంతంలో, నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేట్ కంపెనీకి భూమి కేటాయించేలా ఆమె ప్రభావితం చేశారని అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. ఈ మేరకు ఏసీసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఏకేఎం మోర్తుజా అలీ సాగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ స్పెషల్ జడ్జి మహ్మద్ సబ్బీర్ ఫైజ్.. ఆమె అరెస్టుకు వీలుగా ఇంటర్‌పోల్ సాయం కోరాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే ఆరేళ్ల జైలు శిక్ష

తులిప్ సిద్ధిక్‌పై గతంలోనే మూడు అవినీతి కేసులు నమోదయ్యాయి. షేక్ హసీనాతో కలిసి సాగించిన ఈ అక్రమాల్లో కోర్టు ఆమెకు ఇప్పటికే ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను తులిప్ తోసిపుచ్చారు. "నేను బ్రిటీష్ పౌరురాలిని, బంగ్లాదేశీని కాదు. ఈ తీర్పులన్నీ ఒక పెద్ద బూటకం " అని ఆమె గతంలోనే కొట్టిపారేశారు. హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కేబినెట్‌లో ఆర్థిక కార్యదర్శిగా ఉన్న తులిప్, ఈ వివాదాల కారణంగా గత ఏడాది జనవరిలో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

మారుతున్న రాజకీయ సమీకరణాలు

2024లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ప్రజా విప్లవంతో షేక్ హసీనా 15 ఏళ్ల పాలన అంతమైంది. అప్పటి నుంచి ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. హసీనా నిష్క్రమణ తర్వాత నోబెల్ విజేత మహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటవగా, ఈ ఏడాది ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో హసీనా రాజకీయ ప్రత్యర్థి ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహ్మాన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. కొత్త ప్రభుత్వం హసీనా కుటుంబ సభ్యుల అక్రమాలను వెలికితీసే ప్రక్రియను వేగవంతం చేసింది.

బ్రిటన్ ఎంపీ తులిప్ సిద్ధిక్‌ అరెస్ట్‌కు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించండి: బంగ్లా కోర్టు - Tholi Paluku