
బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌గా పెరియసామి కుమారన్
భారత విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నత స్థాయి దౌత్య వర్గాల్లో కీలక మార్పులు చేపట్టింది. బ్రిటన్ లో భారత తదుపరి హైకమిషనర్‌గా సీనియర్ దౌత్యవేత్త పెరియసామి కుమారన్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా (తూర్పు విభాగం) బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన, త్వరలోనే లండన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి అయిన కుమారన్, తన సుదీర్ఘ కెరీర్‌లో వివిధ దేశాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం కలిగి ఉన్నారు.
మూడు దశాబ్దాల దౌత్య ప్రస్థానం
పెరియసామి కుమారన్ దౌత్య ప్రస్థానం 1994లో కైరోలోని భారత రాయబార కార్యాలయంలో థర్డ్ సెక్రటరీగా ప్రారంభమైంది. ఆ తర్వాత ట్రిపోలి, బ్రసెల్స్ వంటి నగరాల్లో పనిచేశారు. 2005-2007 మధ్య బెంగళూరు ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా సేవలు అందించిన ఆయన, ఇస్లామాబాద్, వాషింగ్టన్, కొలంబోలలో కూడా కీలక పదవులు చేపట్టారు. 2016 నుండి 2020 వరకు ఖతార్‌లో భారత రాయబారిగా, 2020 నుండి 2023 వరకు సింగపూర్‌లో హైకమిషనర్‌గా విశేష సేవలందించారు. 2025 ఏప్రిల్ నుండి విదేశీ వ్యవహారాల శాఖలో సెక్రటరీ (ఈస్ట్)గా కొనసాగుతున్న ఆయన, ఇప్పుడు బ్రిటన్‌లో భారత ప్రతినిధిగా వెళ్లనున్నారు.
చైనాకు విక్రమ్ దొరైస్వామి
ప్రస్తుతం బ్రిటన్ హైకమిషనర్‌గా ఉన్న విక్రమ్ దొరైస్వామిని చైనాలో భారత తదుపరి రాయబారిగా ప్రభుత్వం నియమించింది. కుమారన్ వలెనే ఈయన కూడా 1992 బ్యాచ్ అధికారి కావడం విశేషం. దౌత్య రంగంలోకి రాకముందు ఆయన ఏడాది పాటు జర్నలిస్టుగా పనిచేశారు. దొరైస్వామి నియామకాన్ని చైనా ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే క్రమంలో ఆయనకు పూర్తి సహకారం అందిస్తామని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించారు.
