Let's talk: editor@tmv.in
బ్రిక్స్ 2026 సారథిగా భారత్.. లోగో, వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

బ్రిక్స్ 2026 సారథిగా భారత్.. లోగో, వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

Shaik Mohammad Shaffee
14 జనవరి, 2026

అంతర్జాతీయ వేదికపై భారత్ తన ప్రాబల్యాన్ని చాటుకునే మరో అద్భుత అవకాశం లభించింది. 2006లో ఏర్పాటైన శక్తివంతమైన దేశాల కూటమి ‘బ్రిక్స్’కు 2026 సంవత్సరానికి గాను భారత్ నాయకత్వం వహించనుంది. ఈ ప్రతిష్ఠాత్మక 18వ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన అధికారిక లోగోను, వెబ్‌సైట్‌ను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిక్స్ కూటమి ఏర్పడి 20 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో, భారత్ ఈ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని పేర్కొన్నారు.

లోగోలో విశిష్టత.. భారతీయత

బ్రిక్స్ 2026 సదస్సు కోసం రూపొందించిన లోగోలో భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా 'కమలం' పువ్వును ప్రధానంగా ఎంచుకున్నారు. ఆ కమలం రేకులకు బ్రిక్స్ కూటమిలోని అన్ని సభ్య దేశాల జెండాల రంగులను అద్దడం ద్వారా, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పారు. లోగో మధ్యలో ఉన్న 'నమస్తే' గుర్తు ప్రపంచ దేశాల మధ్య ఉండే పరస్పర గౌరవానికి, స్నేహపూర్వక సహకారానికి నిదర్శనంగా నిలుస్తుంది. దీనికి అనుబంధంగా "స్థైర్యం, సరికొత్త ఆలోచనలు, సహకారం, సుస్థిరత" అనే నినాదాన్ని జోడించారు. అంటే, ప్రజలందరికీ మేలు జరిగేలా, అందరూ ఐక్యంగా ఉంటూ అభివృద్ధి వైపు సాగాలన్నదే ఈ లోగో అంతరార్థం.

బ్రిక్స్‌ వెబ్‌సైట్‌ ప్రత్యేకతలు

ఇక ఈ సదస్సుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడానికి ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. బ్రిక్స్ చేపట్టే కొత్త ప్రాజెక్టులు, జరిగే సమావేశాలు, తీసుకునే కీలక నిర్ణయాల వంటి వివరాలన్నీ ఒకే చోట దొరికేలా దీనిని తీర్చిదిద్దారు. భారత్ అధ్యక్షతన జరిగే కార్యక్రమాల్లో పారదర్శకతను పెంచడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములకు ఈ సమాచారాన్ని సులభంగా చేరువ చేయడమే ఈ వెబ్‌సైట్ ప్రధాన లక్ష్యం.

బ్రిక్స్‌ 2026కు నాలుగు కీలక ప్రాధాన్యాలు

లోగో, వెబ్‌సైట్‌ ఆవిష్కరణ అనంతరం మాట్లాడిన జైశంకర్‌ బ్రిక్స్‌ 2026కు నాలుగు ప్రధాన ప్రాధాన్యాలు ఉంటాయని స్పష్టం చేశారు. అవేంటంటే.. ఆర్థిక సంక్షోభాలు, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు తట్టుకోగలిగే శక్తిని (స్థైర్యం) పెంచడం, కొత్త సాంకేతికతలతో సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడం (నవోన్నతి), దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలను మెరుగుపరచడం (సహకారం), పర్యావరణాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి చెందడం (సుస్థిరత). ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్యం, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధిలో బ్రిక్స్ దేశాల మధ్య సమన్వయం పెంచడమే భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

బ్రిక్స్ ప్రస్థానం

బ్రిక్స్ కూటమి ప్రస్థానం గత రెండు దశాబ్దాలలో అసాధారణ రీతిలో విస్తరించింది. 2001లో గోల్డ్‌మన్‌ శాక్స్‌ ప్రతిపాదించిన ‘బ్రిక్ (BRIC-బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా)' అనే ఆర్థిక భావన, 2006లో భారత్, రష్యా, చైనా దేశాల కలయికతో ఒక అధికారిక రూపం దాల్చింది. 2009లో రష్యాలో మొట్టమొదటి భారీ సదస్సు జరగ్గా, 2011లో దక్షిణాఫ్రికా చేరికతో ఇది 'బ్రిక్స్'గా మారింది. ఆ తర్వాత 2024లో ఈజిప్ట్, ఇరాన్ వంటి దేశాలు, 2025లో ఇండోనేషియా కూడా చేరడంతో ఈ కూటమి మరింత బలపడింది. ప్రస్తుతం మలేషియా, థాయ్‌లాండ్, నైజీరియా, బెలారస్ వంటి మరో 9 దేశాలు ఇందులో భాగస్వామ్య దేశాలుగా ఉంటూ కూటమి ప్రాబల్యాన్ని పెంచుతున్నాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ‘బ్రిక్స్’ హవా

ప్రస్తుతం ఈ కూటమిలో 11 సభ్య దేశాలు ఉన్నాయి. ఇవి ప్రపంచ జనాభాలో 49.5 శాతం, అంతర్జాతీయ స్థూల జాతీయోత్పత్తిలో 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 26 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా మారిన ఈ వేదికను, భారత నాయకత్వంలో మరింత బలోపేతం చేస్తామని కేంద్ర మంత్రి జైశంకర్ ధీమా వ్యక్తం చేశారు.