Let's talk: editor@tmv.in
బ్యాడ్మింటన్‌లో శ్రీలంకపై భారత్‌ ఘన విజయం

బ్యాడ్మింటన్‌లో శ్రీలంకపై భారత్‌ ఘన విజయం

Shaik Mohammad Shaffee
8 అక్టోబర్, 2025

గౌహతిలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ గ్రూప్ హెచ్ పోరులో భారత్ శ్రీలంకపై అద్భుత ప్రదర్శన కనబరిచి, నాకౌట్ దశకు మరింత చేరువైంది.

గ్రూప్ హెచ్‌లో రెండో సీడ్‌గా, గ్రూప్ టాపర్‌గా నిలుస్తుందని భావించిన భారత్, అంచనాలను అందుకుంటూ శ్రీలంకపై 45-27, 45-21 తేడాతో విజయం సాధించింది. సోమవారం యూఏఈపై శ్రీలంక అతి కష్టం మీద గెలిచిన విషయం తెలిసిందే. భారత జట్టు సోమవారం నేపాల్‌తో ఆడినప్పటికీ, మంగళవారం శ్రీలంకతో పోరులో కొత్త ఆటగాళ్ల బృందాన్ని రంగంలోకి దించింది.

బాలుర సింగిల్స్‌లో లాల్తజులా హ్మార్, కెనెత్ అరుగొడను 9-2 తేడాతో ఓడించి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత భవ్య ఛబ్రా, మిథిలేష్ పి. కృష్ణన్ జోడీ, సనుద అరియసింఘే, తిసత్ రూపతుంగలపై ఆధిక్యాన్ని 18-6కి పెంచారు.

బాలికల సింగిల్స్‌లో రక్షిత శ్రీ తొలుత 3-8తో వెనుకబడి ఉన్నా తిరిగి పుంజుకొని స్కోరును 36-21కి తీసుకెళ్లింది. చివరికి సి లాల్ రాంసంగా, తారిణి సూరి జోడీ 9-6తో అరుగొడ, లియానాగేలను ఓడించి తొలి సెట్‌ను 45-27తో ముగించింది. రెండో సెట్‌ను రౌనక్ చౌహాన్ ప్రారంభించగా, భారత్ పూర్తి కొత్త లైనప్‌తో ఆడి, రెండో సెట్‌ను 45-21తో గెలిచి, టైను సొంతం చేసుకుంది.

14 సార్లు ఛాంపియన్ అయిన చైనా, మాజీ ఛాంపియన్ దక్షిణ కొరియా కూడా తమ గ్రూపులలో రెండో విజయాలను నమోదు చేశారు. ఫిలిప్పీన్స్ సంచలనం సృష్టిస్తూ హాంకాంగ్‌ను 2-1 తేడాతో (42-45, 45-28, 45-43) ఓడించింది. గ్రూప్-డీలో చైనా, ఇంగ్లాండ్‌పై 45-22, 45-19 తేడాతో విజయం సాధించింది. గ్రూప్-జీలో దక్షిణ కొరియా తొలిసారి ఆడుతున్న భూటాన్‌ను 45-5, 45-17 తేడాతో చిత్తు చేసింది.

బ్యాడ్మింటన్‌లో శ్రీలంకపై భారత్‌ ఘన విజయం - Tholi Paluku