Let's talk: editor@tmv.in
బ్యాడ్మింటన్‌కు సైనా నెహ్వాల్ వీడ్కోలు

బ్యాడ్మింటన్‌కు సైనా నెహ్వాల్ వీడ్కోలు

Shaik Mohammad Shaffee
21 జనవరి, 2026

భారత బ్యాడ్మింటన్ రూపురేఖలను మార్చేసిన దిగ్గజ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ ఆటకు వీడ్కోలు పలికారు. గత రెండేళ్లుగా పోటీలకు దూరంగా ఉంటున్న ఆమె, తన రిటైర్మెంట్‌పై సోమవారం అధికారికంగా స్పష్టత ఇచ్చారు. దీర్ఘకాలంగా వేధిస్తున్న మోకాలి గాయం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. "నేను ఆటకు నా సొంత నిబంధనల ప్రకారమే వచ్చాను.. అలాగే నిష్క్రమించాను. అందుకే ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం నాకు అనిపించలేదు" అని సైనా పేర్కొన్నారు.

గాయంతో పోరాటం

2016 రియో ఒలింపిక్స్ సమయంలో తగిలిన మోకాలి గాయం సైనా కెరీర్‌ను మలుపు తిప్పింది. శస్త్రచికిత్స తర్వాత పట్టుదలతో తిరిగి వచ్చి 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించినా, క్రమంగా మోకాలి సమస్య తీవ్రమైంది. "నా మోకాలిలో కార్టిలేజ్ పూర్తిగా అరిగిపోయింది. గంట లేదా రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తేనే మోకాలు వాచిపోతోంది. రోజుకు 8-9 గంటలు ప్రాక్టీస్ చేయనిదే ప్రపంచ స్థాయిలో రాణించడం అసాధ్యం. అందుకే ఇక చాలు అనిపించింది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సైనా చివరిసారిగా 2023 సింగపూర్ ఓపెన్‌లో తలపడ్డారు.

చరిత్ర సృష్టించిన ప్రస్థానం

సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి, బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి ఒలింపిక్ పతకం అందించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. 2015లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షట్లర్‌గా నిలిచారు. 2008లో వరల్డ్ జూనియర్ ఛాంపియన్, 2010లో కామన్వెల్త్ స్వర్ణం, 2015లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ రజతం ఇలా సైనా గెలిచిన పతకాలు అనేకం.

గౌరవ పురస్కారాలు

సైనా సాధించిన విజయాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్, పద్మశ్రీ, ఖేల్ రత్న, అర్జున అవార్డులతో సత్కరించింది. 24కు పైగా అంతర్జాతీయ టైటిళ్లను గెలిచిన ఆమె, నేటితరం పీవీ సింధు వంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రకాశ్‌ పదుకొణె తర్వాత అంతర్జాతీయ స్థాయిలో భారత పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన ఘనత సైనాకే దక్కుతుంది. ఆమె నిష్క్రమణతో భారత బ్యాడ్మింటన్‌లో ఒక స్వర్ణ యుగం ముగిసినట్లయింది.