
బ్యాటరీలేని విలాస గడియారాలకు పెరుగుతున్న క్రేజ్
ఒకప్పుడు చేతిగడియారాల ప్రపంచంలో విప్లవం సృష్టించిన బ్యాటరీలేని (ఆటోమేటిక్) గడియారాలు, తిరిగి లగ్జరీ మార్కెట్‌లో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళలు, వాచ్‌లను సేకరించే ఆసక్తిగల వారి వద్ద డిమాండ్ పెరుగుతోంది. టెక్నాలజీపై ఆధారపడని ఈ గడియారాలు అందం–స్థిరత్వం కలగలిసిన రూపంతో వినియోగదారుల మనసు దోచుకుంటున్నాయి.
1770లలో స్విస్ వాచ్ మేకర్ అబ్రహాం లూయిస్ పెరె్లెట్ మొదట ఆటోమేటిక్ వాచ్ సూత్రాన్ని రూపొందించారు. చేతికి కదలిక వచ్చినప్పుడు లోపల ఉన్న వెయిట్ పనిచేసి గడియారం నడిచే విధంగా ఇది రూపొందించబడింది.
1920లలో జాన్ హార్వుడ్ దీన్ని మరింత అభివృద్ధి చేయడంతో తరువాత మొదటి సెల్ఫ్-వైండింగ్ రోలెక్స్ వెలుగులోకి వచ్చింది. నేటికీ అదే పద్ధతిని ఆధారంగా చేసుకుని, బ్యాటరీ అవసరం లేకుండానే ఈ గడియారాలు పనిచేస్తున్నాయి.
సూక్ష్మ నైపుణ్యం
బ్యాటరీలేని గడియారాలు అనేక భాగాల సమన్వయంతో పనిచేస్తాయి:
• రోటర్ చేతి కదలికను శక్తిగా మారుస్తుంది.
• శక్తి మైన్ స్ప్రింగ్లో నిల్వ అవుతుంది.
• గియర్స్ సమానంగా శక్తిని పంపుతాయి.
• ఎస్కేప్‌మెంట్, బ్యాలెన్స్ వీల్ సమయాన్ని ఖచ్చితంగా కాపాడుతాయి.
• ఉన్నత నమూనాల్లో రూబీలు ఉపయోగించి ఘర్షణ తగ్గించి గడియారం ఎక్కువకాలం నడుస్తుంది.
మహిళల్లో పెరుగుతున్న ఆకర్షణ
లగ్జరీ స్టోర్ల వివరాల ప్రకారం, మహిళల కోసం రూపొందించిన ఆటోమేటిక్ గడియారాల కొనుగోలు గణనీయంగా పెరిగింది.“డిజైన్, సున్నితమైన యాంత్రిక వ్యవస్థ, ఎలక్ట్రానిక్స్‌కు దూరంగా ఉండే స్వతంత్రత ఇవన్నీ మహిళా కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి అని ముంబైలోని ఒక లగ్జరీ వాచ్ విక్రేత తెలిపారు. ఇవి ఫ్యాషన్‌తో పాటు, దీర్ఘకాల పెట్టుబడిగా పనిచేయగలగడం వల్ల మహిళలు మరింత ఆదరణ చూపుతున్నారు.
