
బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రక వారసత్వ సంపదను కాపాడేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్రంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను కలిపి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బౌద్ధ సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
విభజన అనంతర తవ్వకాలు.. అరుదైన ఆధారాలు
రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 65 ప్రాంతాల్లో తవ్వకాలు జరగగా విభజన అనంతరం పురావస్తు శాఖ మూడు ప్రధాన ప్రాంతాల్లో పరిశోధనలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. 2014-16 మధ్య కాకినాడ జిల్లా ఎ.కొత్తపల్లి (పెద్దమెట్ట)లో జరిపిన తవ్వకాల్లో మహాస్థూపాలు, విహారాలు, ఓటివ్ స్థూపాలు లభ్యమయ్యాయని తెలిపారు. అదేవిదంగా పోలవరం ముంపు ప్రాంతాలైన రుద్రమకోట, రాయనపేటలలో జరిపిన పరిశోధనల్లో క్రీ.పూ.1000-300 నాటి ప్రాచీన మానవుడి సమాధులు (మెగా లిథిక్స్) ఇనుప వస్తువులు వెలుగు చూశాయని ఇవి మన ప్రాచీన సంస్కృతికి నిలువుటద్దాలని పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి పురావస్తు సంపద వాపస్
విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురావస్తు సంపదను తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోందని మంత్రి తెలిపారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రాథమిక చర్చలు జరిగాయని త్వరలోనే ఇరు రాష్ట్రాల అధికారుల సమన్వయంతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దొరికిన అవశేషాలను గ్రంథస్తం చేసి, మ్యూజియాల్లో భద్రపరుస్తామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలోని కళింగుల రాజధాని దంతపురం, విజయనగరం జిల్లా గుడివాడకొండలలో కొత్తగా తవ్వకాలు చేపడతామని మంత్రి ప్రకటించారు.
గ్లోబల్ టూరిజం హబ్‌గా బౌద్ధ క్షేత్రాలు
అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల, ఆదుర్రు, తొట్లకొండ, బావికొండ, చిత్రకోట వంటి ప్రాంతాలను కలిపి బౌద్ధ సర్క్యూట్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహకారంతో, కేంద్ర బడ్జెట్ నిధులను వినియోగించుకుని విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.గతంలో వియత్నాంలో బుద్ధుడి పవిత్ర అవశేషాల ప్రదర్శనను తాను స్వయంగా చూశానని ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడి బోధనలకు ఉన్న ఆదరణను ఏపీ పర్యాటక రంగానికి అనుసంధానం చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ చర్చలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ తెలుగు సంస్కృతి, పురావస్తు అంశాలపై ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌కు ఉన్న శ్రద్ధను మంత్రి దుర్గేష్ చొరవను అభినందించారు. కేంద్రం నుంచి నిధుల సాధనకు అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
