
బోయినపల్లి మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ గరీమా అగర్వాల్
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మోడల్ స్కూల్‌లో జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల తరగతి గదులను సందర్శించి, బోధన విధానాలు, విద్యార్థుల హాజరు, మిడ్‌డే మీల్ నాణ్యత, పరిశుభ్రత వంటి అంశాలను సమీక్షించారు. విద్యార్థులతో మాట్లాడిన ఆమె వారి చదువు, లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ప్రతి విద్యార్థి ముందుగా రూపొందించిన చదువు ప్రణాళికను పాటించడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఇంటి వద్ద కూడా ప్రతిరోజు కనీసం నిర్ణీత సమయం చదువుకు కేటాయించాలని, ఉపాధ్యాయులు ఇచ్చే అసైన్‌మెెంట్లు, టెస్టులను క్రమం తప్పకుండా పూర్తి చేయాలని సూచించారు. క్రమశిక్షణ, దృష్టి, పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నత స్థాయిలో ఎదగగలరని ఆమె విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.
ఉపాధ్యాయులపైనా ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యార్థుల బలహీనమైన అంశాలను గుర్తించి వారికి వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేయాలని సూచించారు. పిల్లల వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపు, పోటీ పరీక్షలకు సిద్ధం చేసే విధానాలపై ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ చూపాలని కోరారు.పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
