Let's talk: editor@tmv.in
బోయినపల్లి మార్కెట్ యార్డ్ కాదు.. అది ఒక ‘డంపింగ్‌ యార్డ్’: ఎంపీ ఈటల రాజేందర్
బోయినపల్లి మార్కెట్ యార్డ్ కాదు.. అది ఒక ‘డంపింగ్‌ యార్డ్’: ఎంపీ ఈటల రాజేందర్

బోయినపల్లి మార్కెట్ యార్డ్ కాదు.. అది ఒక ‘డంపింగ్‌ యార్డ్’: ఎంపీ ఈటల రాజేందర్

Gaddamidi Naveen
29 మార్చి, 2026

హైదరాబాద్‌లోని బోయినపల్లి వ్యవసాయ మార్కెట్‌లో నెలకొన్న దారుణ పరిస్థితులపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌ను స్వయంగా పరిశీలించిన ఆయన, అక్కడి రైతులు, కార్మికులు, వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో పేరుకుపోయిన చెత్త, అపరిశుభ్రతను నిరసిస్తూ ఆయన అక్కడే ధర్నాకు దిగారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ దుస్థితిని వివరించారు.

సుమారు 24 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ మార్కెట్‌కు ప్రతిరోజూ దాదాపు 10 వేల మంది కస్టమర్లు రాకపోకలు సాగిస్తుండగా, సంవత్సరానికి 14 నుంచి 15 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు. అయితే గత తొమ్మిది నెలలుగా చెత్త తొలగింపు, టాయిలెట్ నిర్వహణ వంటి సేవలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగకపోవడంతో మార్కెట్ యార్డ్ చెత్తకుప్పగా మారిందని విమర్శించారు.వందల లారీల చెత్త పేరుకుపోవడంతో కుళ్లిపోయిన కూరగాయల నుంచి వచ్చే దుర్గంధపూరిత ద్రవాలు మార్కెట్ అంతా వ్యాపించి, కార్మికులు, వ్యాపారులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆయ‌న‌ చెప్పారు. ఈ దుర్వాసన కారణంగా కస్టమర్లు తగ్గిపోవడంతో వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.

మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, టాయిలెట్లలో నీళ్లు లేకపోవడం, తలుపులు లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆయ‌న వెల్లడించారు. మహిళలు టాయిలెట్‌కు వెళ్లాలంటే భద్రత కోసం మరొక మహిళ కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అలాగే మార్కెట్‌లోని వాటర్ ట్యాంక్ ఖాళీగా ఉండటం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. తాను వస్తున్నానని తెలిసి తాత్కాలికంగా బ్లీచింగ్ పౌడర్ చల్లడం తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదని ఆయన విమర్శించారు. మార్కెట్‌లోని చెత్త పూర్తిగా తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థను సరిచేయడం, బయోగ్యాస్ ప్లాంట్‌ను పునరుద్ధరించడం, కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించడం వంటి చర్యలు తీసుకునే వరకు తాను ధర్నా కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

కమీషన్ల కోసమే ఫైళ్లు ఆపుతున్నారా?

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కూడా ఈటల తీవ్ర విమర్శలు గుప్పించారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ అంటూ లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్న రేవంత్ రెడ్డి.. నెలకు రూ. 7 లక్షలు ఇచ్చి మార్కెట్‌ను సాఫ్ చేయించలేకపోవడం సిగ్గుచేటు. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం వెళ్తే 10 శాతం కమీషన్ ఇస్తేనే సంతకం పెడతామని అధికారులు అంటున్నారంటే ఈ ప్రభుత్వం ఎటు పోతుందో అర్థం చేసుకోవాలని ఆయ‌న పేర్కొన్నారు. కేవలం సంపాదన, ఢిల్లీకి డబ్బులు పంపడంపైనే ధ్యాస తప్ప ప్రజల ఆరోగ్యంపై లేదని ఆయన ఆరోపించారు. మంత్రి పదవిలో ఉండి ఈ సమస్యలు పరిష్కరించలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.వెంటనే అధికారులను పంపించి సమస్యను పరిష్కరించకపోతే వేలాది మంది కార్మికులతో కలిసి ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని ఆయ‌న‌ హెచ్చరించారు.

బోయినపల్లి మార్కెట్ యార్డ్ కాదు.. అది ఒక ‘డంపింగ్‌ యార్డ్’: ఎంపీ ఈటల రాజేందర్ - Tholi Paluku