Let's talk: editor@tmv.in
బోనాలు పండుగకు సంబంధించిన అత్యంత ప్రాచీన శాసనం

బోనాలు పండుగకు సంబంధించిన అత్యంత ప్రాచీన శాసనం

Dantu Vijaya Lakshmi Prasanna
25 డిసెంబర్, 2025

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక శాసనం బోనాలు పండుగ చరిత్రను తిరిగి రాస్తోంది. తెలంగాణలోని ప్రముఖ పండుగ అయిన బోనాలు, కుతుబ్‌షాహీ కాలానికి ముందే ఉన్నదని ఈ శాసనం స్పష్టమైన ఆధారాలతో వెల్లడిస్తోంది. ఈ శాసన ఆధారం ప్రకారం, బోనాలు పండుగ చరిత్ర క్రీ.శ. 1516 వరకూ వెనక్కి వెళ్లుతోంది.

ఈ శాసన ఆధారం తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని గోబ్బూరు గ్రామం సమీపంలో లభించింది. ఇది విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల పరిపాలనా కాలానికి చెందినది. తెలుగు లిపిలో రాసిన ఈ శాసనం. శక సంవత్సరం 1438, ధాతు నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం తృతీయ తిథి, అనగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆదివారం, మే 4, 1516 తేదీకి చెందింది.

ఈ శాసనంలో రంగం (భవిష్యవాణి), కూనముగ్గు, గడ్డపట్టణం, బోనాలు వంటి ఆచారాలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నుల నుంచి మినహాయింపులు ఇచ్చినట్టు నమోదు చేయబడింది.

అంతేకాకుండా, కొండపల్లి దేవత సన్నిధిలో బోనాలు ఉత్సవం నిర్వహించేందుకు, రాయసం కొండమరసయ్య ఆదేశాల మేరకు, పెద్దచెరువు, బొల్లసముద్రం చెరువుల కిందనున్న భూములను దానంగా ఇచ్చినట్టు ఈ శాసనం తెలియజేస్తోంది. ఈ శాసన స్తంభాన్ని కృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో పర్వతయ్య ప్రతిష్ఠించినట్టు కూడా ఇందులో పేర్కొనబడింది.

భారత పురావస్తు సర్వే శాఖ (ఎపిగ్రఫీ) డైరెక్టర్ డా. కె. మునిరత్నం రెడ్డి మాట్లాడుతూ, ఈ శాసనం మొదటగా 1961లో నకలు (కాపీ) చేయబడినప్పటికీ, ఇప్పుడు దక్షిణ భారత శాసన సంపుటాల కోసం ఎస్టాంపేజ్ ప్రతులను పునఃపరిశీలించేటప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా పండుగలను కొనసాగించాలన్న శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా దూరదృష్టిని ఈ పన్ను మినహాయింపులు ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ శాసనాన్ని సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళీ ఆలయం వంటి ప్రముఖ స్థలానికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్లు కూడా ఆయన తెలిపారు.

ఇదే సందర్భంలో, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సహాయ ప్రొఫెసర్ డా. ఎం.ఏ. శ్రీనివాసన్ మాట్లాడుతూ, “బోనాలు పండుగను వివరించే మొట్టమొదటి శాసనం ఇదే. ఇప్పటివరకు చరిత్రలో బోనాల ఆవిర్భావాన్ని కుతుబ్‌షాహీ కాలానికి ఆపాదించేవారు. కానీ ఈ శాసనం ప్రకారం, బోనాలు పండుగ కుతుబ్‌షాహీలకు ముందే, అంటే ప్రీ–కుతుబ్‌షాహీ కాలంలోనే ఉన్నదని స్పష్టమవుతోంది” అని తెలిపారు.