
బోధనాసుపత్రుల్లో హెర్బల్ గార్డెన్స్ ఏర్పాటు:
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రులకు వచ్చే రోగులు, వారి సహాయకులకు ఆసుపత్రి ప్రాంగణంలోనే మానసిక ప్రశాంతతను చేకూర్చేలా కూటమి ప్రభుత్వం ఒక వినూత్న ప్రణాళికను అమల్లోకి తెస్తోంది. సాధారణంగా ఆసుపత్రుల్లో కనిపించే రద్దీ, హడావుడి వల్ల రోగులు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. దీనిని నివారించి వారికి స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు హాస్పిటల్ ప్రాంగణాల్లో ‘హెర్బల్ గార్డెన్స్’ (ఔషధ వనాలు) నిర్మించాలని నిర్ణయించింది. కేవలం భవనాలకే పరిమితం కాకుండా ప్రకృతితో మమేకమయ్యేలా ఆసుపత్రి పరిసరాలను తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
కాగా మొదటి విడతలో భాగంగా వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని 35 ఆసుపత్రులను అధికారులు గుర్తించారు. ఇందులో విశాఖలోని విమ్స్, ఈఎన్టీ ఆసుపత్రులతో పాటు తిరుపతి ప్రసూతి వైద్యశాల, పలాస కిడ్నీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రత్యేక విభాగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ వనాల్లో కేవలం మొక్కలే కాకుండా రోగులు కాసేపు సేదతీరేందుకు వీలుగా విశ్రాంతి బెంచీలు, నడక సాగించడానికి వాకింగ్ ట్రాక్‌లు స్వచ్ఛమైన తాగునీటి సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. స్థల లభ్యతను బట్టి కనీసం అర ఎకరా విస్తీర్ణంలో ఈ ఉద్యానవనాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ హెర్బల్ గార్డెన్స్‌లో తులసి, అశ్వగంధ, బిల్వపత్రం, రణపాల, బ్రహ్మి వంటి సుమారు 40 రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలను నాటనున్నారు. ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ సహకారంతో ఈ తోటలకు రూపకల్పన చేస్తున్నారు. ఇవి కేవలం రోగులకే కాకుండా వైద్య విద్యార్థులకు ఔషధ మొక్కల ప్రత్యక్ష విజ్ఞానాన్ని అందించే 'సజీవ ప్రయోగశాలలు'గా ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.
