
బోట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల జాతర
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సొంత నిధులతో నల్గొండలో ప్రభుత్వ విద్యారంగానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చారు. తన సొంత నిధులు రూ.8 కోట్లు వెచ్చించి, తన కుమారుడి జ్ఞాపకార్థం నిర్మించిన బోట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ హైస్కూల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్థాయిని మించి అభివృద్ధి చెందడం విద్యా విప్లవానికి చిహ్నంగా నిలుస్తోంది. సాధారణంగా పాన్-ఇండియా సినిమాల టికెట్ల కోసం థియేటర్ల వద్ద కనిపించే కిలోమీటర్ల పొడవైన క్యూలు ఇప్పుడు నల్గొండలోని ఈ ప్రభుత్వ పాఠశాల వద్ద కనిపిస్తున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ తమ పిల్లలను ఈ స్కూల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు తెల్లవారుజాము నుండే గేట్ల వద్ద బారులు తీరుతున్నారు.
కార్పొరేట్ స్థాయిని మించిన వసతులు
మంత్రి వెంకట్ రెడ్డి ఈ పాఠశాలను ఒక మోడల్ ఇన్‌స్టిట్యూషన్‌గా తీర్చిదిద్దారు. విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్‌ల ద్వారా అత్యాధునిక విద్య అందుతోంది. మొత్తం 36 ఏసీ స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. చదువుతో పాటు సమానంగా క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ విశాలమైన ఆటస్థలాన్ని నిర్మించారు. అలాగే విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.ఇక్కడ ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో బోధన అందుబాటులో ఉంది. నాణ్యమైన విద్యను అందించేందుకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
ఈ పాఠశాల ఖ్యాతి కేవలం నల్గొండ జిల్లాకే పరిమితం కాలేదు. పొరుగు జిల్లాల నుంచి కూడా అడ్మిషన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. పరిమిత సీట్లు ఉండటంతో ప్రవేశం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇది కేవలం పాఠశాల మాత్రమే కాదు, ఒక కార్పొరేట్ యూనివర్సిటీ స్థాయి సంస్థ అని తల్లిదండ్రులు కొనియాడుతున్నారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడంలో ఈ పాఠశాల ఒక రోల్ మోడల్‌గా నిలిచింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిస్వార్థ కృషి, దూరదృష్టి వల్ల ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వగలవని ఈ స్కూల్ నిరూపించింది. నల్గొండలోని బోట్టుగూడ ప్రతీక్ హైస్కూల్ ఇప్పుడు తెలంగాణ విద్యా చరిత్రలో ఒక చెరగని ముద్ర వేస్తోంది.
