
బొప్పూడిలో ఆలయ పనులు ప్రారంభించిన గవర్నర్
బొప్పూడి శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దివ్య క్షేత్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా టీటీడీ కేటాయించిన రూ.10.99 కోట్ల నిధులతో ఆలయ జీర్ణోద్ధరణ, త్రిమూర్తుల పుష్కరిణి, నూతన గరుడ విగ్రహ నిర్మాణ పనులకు వైభవంగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలోని పురాతన ఆలయాల పునరుద్ధరణ, సనాతన ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక వైభవాన్ని కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆలయాల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందిస్తున్న టీటీడీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. బొప్పూడి శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి క్షేత్ర అభివృద్ధితో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ కృష్ణమోహన్, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
