
బొగ్గురంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం: కిషన్‌రెడ్డి
మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రూ.64,000 కోట్ల పెట్టుబడితో 7 కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అదనపు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చని చెప్పారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం బొగ్గు రంగంలో పలు సంస్కరణలు తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. బొగ్గు బ్లాకులను పారదర్శక వేలం విధానంలో కేటాయిస్తున్నామని, ఎలాంటి ఆరోపణలు లేకుండా ఈ ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు. దేశంలో విద్యుత్ కొరత లేదని, ప్రస్తుతం 73-74 శాతం విద్యుత్ ఉత్పత్తి బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్ల ద్వారా జరుగుతోందని తెలిపారు. ఉత్పత్తి అయ్యే బొగ్గులో 80 శాతం విద్యుత్ రంగానికి, మిగతా 20 శాతం ఇతర రంగాలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుడు, వినియోగదారుడని, దేశానికి ఐదవ అతిపెద్ద బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఈ నిల్వలు కనీసం 70 సంవత్సరాల పాటు సరిపోతాయని, అందుకే అన్వేషణ కార్యక్రమాలను పెంచుతున్నామని చెప్పారు.
నాలుగు మహారాష్ట్రలో ఏర్పాటు
కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గును ‘సింథసిస్ గ్యాస్’ (సింగ్యాస్)గా మారుస్తారని, దీని ద్వారా మెథనాల్, అమ్మోనియా, యూరియా, హైడ్రోజన్, సింథటిక్ నేచురల్ గ్యాస్ (ఎస్‌ఎన్‌జీ), పెట్రోకెమికల్స్, ద్రవ ఇంధనాలు తయారు చేయవచ్చని తెలిపారు. గ్యాసిఫికేషన్ ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చు. విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తం 7 ప్రాజెక్టుల్లో నాలుగు మహారాష్ట్రలో, రెండు ఒడిశాలో, ఒకటి పశ్చిమ బెంగాల్‌లో ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులకు భూమిపూజలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు. ఇక కమర్షియల్ కోల్ మైనింగ్ పాలసీ కింద కేటాయించిన 131 బొగ్గు బ్లాకుల్లో, 21 బ్లాకులు గనుల ప్రారంభానికి అనుమతులు పొందగా, 2026 ఫిబ్రవరి 28 నాటికి 12 బ్లాకుల్లో ఉత్పత్తి ప్రారంభమైందని మంత్రి లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
