
బొగ్గుకే పరిమితం కాకూడదు.. అరుదైన ఖనిజాల తవ్వకాలపై సింగరేణి దృష్టి సారించాలి: డిప్యూటీ సీఎం భట్టి
సింగరేణి సంస్థను రక్షించి, బలోపేతం చేస్తూ ప్రపంచస్థాయి పోటీ సంస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి అభివృద్ధి కోసం ప్రభుత్వ తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి, జెన్‌కో ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భవిష్యత్తులో సౌరశక్తి, విండ్, హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలు వేగంగా పెరుగుతుండటంతో రాబోయే 15–20 ఏళ్లలో థర్మల్ విద్యుత్, బొగ్గుపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సింగరేణి కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా, కొత్త రంగాల్లోకి విస్తరించాలని సూచించారు. తెలంగాణ ఆత్మగా నిలిచిన 130 ఏళ్ల నాటి సింగరేణి పురోగతికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
గతంలో ఉన్న ఏకఛత్రాధిపత్యం ఇప్పుడు లేదని, బొగ్గు బ్లాకుల వేలం వల్ల ప్రైవేట్ కంపెనీలతో పోటీ పెరిగిందని ఆయన గుర్తుచేశారు. క్వాలిటీ తగ్గకుండా చూస్తూ, నిర్వహణ ఖర్చులను తగ్గించుకుని నాణ్యమైన సేవలను అందించడం ద్వారానే ప్రైవేట్ సంస్థలను తట్టుకోగలమని చెప్పారు. తవ్వకాల సమయంలో బొగ్గులో మట్టి, రాళ్లు కలవకుండా చూస్తూ ప్రాసెస్ చేసిన నాణ్యమైన బొగ్గును అందించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు లేక భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులకు సొంత బొగ్గు బ్లాకులను సాధించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒడిశాలోని నైని బ్లాక్, తాడిచర్ల-II ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యలను వేగంగా పరిష్కరించామని చెప్పారు.
సింగరేణి సంస్థ కేవలం వ్యాపార సంస్థ మాత్రమే కాదని, వేలాది మంది కార్మికుల కుటుంబాల జీవనాధారమని చెప్పారు. లాభాలు పెరిగితేనే ఉద్యోగుల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందన్నారు. ప్రతి గనిలో కార్మికులు, ట్రేడ్ యూనియన్లతో చర్చించి సంస్థను నిలబెట్టుకోవడానికి వారి సలహాలు తీసుకోవాలని ఆదేశించారు.
సింగరేణి వద్ద దశాబ్దాల అనుభవం ఉన్న ఇంజనీర్లు, మైనింగ్ నిపుణులు ఉన్నారని, వారి నైపుణ్యాన్ని వినియోగించుకుని సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ తయారీకి అవసరమైన లిథియం, కోబాల్ట్ వంటి అరుదైన ఖనిజాల తవ్వకాల్లోకి ప్రవేశించాలని ఆయన సూచించారు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో క్రిటికల్ మినరల్ బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనాలని ప్రతిపాదించారు. భవిష్యత్తులో బోర్డు సమావేశాలు రొటీన్ పరిపాలనకే కాకుండా సింగరేణి విస్తరణ, రాబోయే 10 ఏళ్ల సమగ్ర రోడ్‌మ్యాప్‌పై కార్పొరేట్ తరహా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
