
బైక్‌పై పొలాల్లోకి వెళ్లి భూ సమస్యల పరిష్కరించిన గద్వాల జిల్లా కలెక్టర్
పరిపాలన అంటే కేవలం ఏసీ గదులు, ఫైళ్లకు మాత్రమే పరిమితం కాదని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీ. ఎం. సంతోష్ నిరూపించారు.క్షేత్రస్థాయిలో రైతుల మధ్యకు నేరుగా వెళ్లి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే పాలన ఎలా ఉండాలో ఆయన చేతల్లో చూపించారు. పెండింగ్‌లో ఉన్న భూ భారతి భూ దరఖాస్తుల పరిశీలన కోసం కలెక్టర్ స్వయంగా బైక్‌పై గ్రామాలకు వెళ్లి పొలాలను సందర్శించారు. రైతులు సాగు చేస్తున్న భూముల వద్దే నిలబడి సరిహద్దులు, రికార్డులను తన కళ్లతో పరిశీలించారు.
గ్రామాల్లో భూ వివాదాలు, సర్వే సమస్యలపై రైతులతో మాట్లాడి వారి వాదనలు విన్నారు. పాత రికార్డులు, ప్రస్తుత స్థితిగతుల మధ్య తేడాలను గుర్తించి, ఎక్కడ అన్యాయం జరుగుతోందో తెలుసుకున్నారు. అవసరమైన చోట పారదర్శకంగా, న్యాయబద్ధంగా సర్వేలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకూ న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.
రైతుల హర్షం
ఈ సందర్భంగా కలెక్టర్ చూపిన సరళత, అందుబాటు తత్వం రైతులను ఎంతో ఆకట్టుకుంది. ఒక జిల్లా అధికారి తమ పొలాల వద్దకు వచ్చి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించడం తమకు అపూర్వ అనుభవమని రైతులు భావవ్యక్తం చేశారు. తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకం మరింత పెరిగిందని తెలిపారు. భూమి అంటే రైతుకు ప్రాణం. ఆ భూమికి సంబంధించిన సమస్యలను కుర్చీల్లో కూర్చోని కాకుండా, మట్టిని తాకుతూ పరిష్కరించాలన్న సందేశాన్ని కలెక్టర్ బి.ఎం. సంతోష్ తన చర్యలతో ఇచ్చారు. పాలన ప్రజల దగ్గరికి వెళ్లినప్పుడే నిజమైన మార్పు సాధ్యం అన్న భావనకు ఈ ఘటన సజీవ ఉదాహరణగా నిలిచింది.
