
బేగంపేట విమానాశ్రయంలో అట్టహాసంగా ప్రారంభమైన 'వింగ్స్ ఇండియా 2026'
బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన వింగ్స్ ఇండియా 2026 ప్రదర్శన, భారత విమానయాన రంగ సత్తాను ప్రపంచానికి చాటుతోంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ప్రారంభమైన ఈ వేడుకలు బుధవారం నుంచి 4 రోజుల పాటు "వింగ్స్ ఇండియా-2026" పేరిట జరగనున్నాయి.
పౌరవిమానయాన శాఖ, ఫిక్కీ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఎయిర్‌ఇండియా, హాల్, ఇండిగో సహా విమానయాన సంస్థలకు చెందిన అధునాతన విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శనలో ఉంచారు. ఈ మెగా ఈవెంట్ లో విమానాల తయారీ, నిర్వహణ , సుస్థిర ఇంధనం, డ్రోన్ సాంకేతికతపై ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. రానున్నమూడురోజుల్లో ఈ వేదికలపై పరిశ్రమ నిపుణులు, విధాన నిర్ణేతలు భవిష్యత్ సవాళ్లు, అవకాశాలపై లోతైన చర్చలు జరుపనున్నారు.
ఈ కార్యక్రమంలో గ్లోబల్ సిఇఓల ఫోరమ్, మినిస్టీరియల్ ప్లీనరీ సెషన్లు, సిఇఓల రౌండ్‌టేబుల్స్, బి2బి, బి2జి సమావేశాలు, ఏవియేషన్ జాబ్ ఫెయిర్, స్టూడెంట్ ఇన్నోవేషన్ కాంపిటీషన్ వంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. యువతను విమానయాన రంగం వైపు ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ఏవియేషన్ జామ్, సివిల్ ఏవియేషన్ ఇన్నోవేషన్ చాలెంజ్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో 150 మందికి పైగా ప్రదర్శనకారులు, దాదాపు 7,500 మంది బిజినెస్ విజిటర్లు, లక్ష మందికి పైగా సాధారణ సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా. 500కి పైగా బి2బి, బి2జి సమావేశాలు జరగనున్నాయి. 30కి పైగా విమానాలు ఈ ప్రదర్శనలో భాగం కానున్నాయి.
ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా, అంతర్జాతీయ కంపెనీల మధ్య సహకారం, నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. జనవరి 31 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో గ్లోబల్ సిఈఓల ఫోరమ్, విమానయాన అవార్డులు, యువత కోసం జాబ్ ఫెయిర్ వంటి పలు ఆసక్తికరమైన అంశాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి.
వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని మోడి
వింగ్స్ ఇండియా 2026 ప్రారంభోత్సవ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని, గత దశాబ్ద కాలంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయిందని పేర్కొన్నారు. సామాన్యుడికి కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, వింగ్స్ ఇండియా వంటి వేదికలు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సదస్సులో వెల్లడించిన వివరాల ప్రకారం, భారత విమానయాన రంగం వచ్చే పదేళ్లలో సుమారు 120 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10 లక్షల కోట్ల రూపాయలు) పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా విమానాశ్రయాల మౌలిక సదుపాయాల కల్పన, విమానాల కొనుగోలు, ఎం.ఆర్.ఓ రంగాలలో ఈ పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. విమాన ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో, అంతర్జాతీయ సంస్థలు భారత్‌ను ఒక కీలక విమానయాన కేంద్రంగా చూస్తున్నాయని పౌర విమానయాన శాఖ పేర్కొంది.
గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా భారత్
వింగ్స్ ఇండియా 2026 ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, "ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ స్థిరమైన విధానాలతో ముందుకెళ్తున్న దేశంగా ప్రపంచ గుర్తింపును పొందింది. విమానయాన రంగంలో ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ భాగస్వామ్యాలను మరింత లోతుగా విస్తరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని తెలిపారు. ప్రపంచ దేశాలతో వ్యాపార, సాంకేతిక సహకారాలు పెరగడం వల్ల భారత్ గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పేవింగ్ ద ఫ్యూచర్' అనే థీమ్ తో సాగుతున్న ఈ కార్యక్రమం, భారత్ ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలతో విమానయాన సహకారాన్ని ఎలా బలోపేతం చేసుకోవచ్చనే అంశంపై దృష్టి సారించిందన్నారు. సుస్థిర అభివృద్ధి ఈ ప్రదర్శనలో కీలక అంశంగా నిలిచిందని, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, దేశీయంగా సుస్థిర విమానయాన ఇంధనం, వినియోగం, పర్యావరణహిత సాంకేతికతల అమలు వంటి అంశాలపై భారత్ తీసుకుంటున్న చర్యలను మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.
ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ డిస్‌ప్లేలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎయిర్ ఇండియాకు చెందిన తొలి లైన్-ఫిట్ బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737-8 విమానాలు భారతీయ ఎయిర్‌లైన్స్ ఆధునీకరణకు ప్రతీకగా నిలిచాయి. మరోవైపు, రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ రూపొందించిన ఇల్యూషిన్ IL-114-300 విమానం రష్యా వెలుపల తొలిసారిగా భారత్‌లో ప్రదర్శించబడటం అంతర్జాతీయ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేపింది. సాంకేతిక విప్లవాన్ని దగ్గరగా, విమానాల ప్రదర్శనలతో మాత్రమే కాకుండా, వింగ్స్ ఇండియా 2026లో ఏవియేషన్ విడిభాగాలు, ఏవియానిక్స్, విమాన డిజైన్, భద్రత, నిర్వహణకు సంబంధించిన ఆధునిక సాంకేతికతల ఎగ్జిబిషన్లు కూడా ఉన్నాయి. ఇవి విమానయాన రంగంలో జరుగుతున్న సాంకేతిక విప్లవాన్ని దగ్గరగా చూసే అవకాశాన్ని అందిస్తున్నాయి.
గగనతలంలో అద్భుత విన్యాసాలు
తొలిరోజు ప్రదర్శనలో భాగంగా గగనతలంలో విమానాల విన్యాసాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. భారత వైమానిక దళానికి చెందిన 'సూర్యకిరణ్' బృందం ఉదయం 11 గంటలకు ఆకాశంలో రంగురంగుల పొగలతో అద్భుతమైన విన్యాసాలు చేసింది. అనంతరం అంతర్జాతీయ ఖ్యాతి పొందిన 'గ్లోబల్ స్టార్స్' బృందం మార్క్ జెఫరీస్ నేతృత్వంలో సాహసోపేత ప్రదర్శనలను నిర్వహించింది. సాయంత్రం వేళల్లో ప్రత్యేక డ్రోన్ షోలు, ఏరియల్ ప్రదర్శనలు పర్యాటకులకు కనువిందు చేసాయి.
ఎయిర్ ఇండియా సరికొత్త ప్రస్థానం: విమాన శ్రేణిలో భారీ మార్పులు
ఎయిర్ ఇండియా తన పరివర్తన ప్రయాణంలో అత్యంత కీలక దశకు చేరుకుందని సిఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని వింగ్స్ ఇండియా 2026లో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది సంస్థకు ఒక "నిజమైన పరివర్తన సంవత్సరం" అని అభివర్ణించారు. ముఖ్యంగా, ఎయిర్ ఇండియా కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన మొట్టమొదటి బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ రాకతో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ ఏడాది చివరి నాటికి మరో మూడు 787-9 విమానాలు, రెండు అత్యాధునిక A350-1000 విమానాలు సంస్థలో చేరనున్నాయని, ఇది కేవలం విమానాల సంఖ్య పెంచడమే కాకుండా, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించే దిశగా వేసిన పెద్ద అడుగు అని ఆయన అన్నారు.
అంతర్జాతీయ విస్తరణ, ఆధునీకరణ ప్రణాళికలు
రాబోయే రోజుల్లో ఎయిర్ ఇండియా తన నెట్‌వర్క్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఏడాది కనీసం 20 అత్యాధునిక వైడ్-బాడీ విమానాలను యూరప్, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ మార్గాల్లో నడపాలని నిర్ణయించారని క్యాంప్‌బెల్ విల్సన్ అన్నారు. 2027, 2028 నాటికి ఎయిర్ ఇండియా తన సుదూర ప్రయాణాల విభాగం పూర్తిగా రూపురేఖలు మార్చుకోనుంది. ఇప్పటికే దేశీయ విమానాల అప్‌గ్రేడ్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. కార్పొరేట్ ప్రయాణికులను ఆకర్షించేందుకు బిజినెస్ క్లాస్ క్యాబిన్లను భారీగా పెంచడంతో పాటు, పాత విమానాల రీట్రోఫిటింగ్ పనులను కూడా వేగవంతం చేస్తున్నామన్నారు.
హైదరాబాద్ గగనతలంలో విస్తరిస్తున్న ఈ ప్రదర్శన, భారత విమానయాన రంగం ఇక ఆకాశమే హద్దు అనే సంకేతాన్ని ప్రపంచానికి స్పష్టంగా పంపిస్తోంది. నాలుగు రోజుల పాటు సాగనున్న వింగ్స్ ఇండియా 2026లో తొలి రెండు రోజులు పరిశ్రమ వర్గాలు, విధాన స్థాయి చర్చలకు కేటాయించగా, మిగిలిన రెండు రోజులు సాధారణ ప్రజల సందర్శన కోసం తెరిచి ఉంచారు. ఏరోబాటిక్ ఫ్లయింగ్ షోలు, వివిధ దేశాల విమానాల ప్రత్యక్ష ప్రదర్శనలు గగనతలాన్ని ఉత్సాహంతో నింపుతున్నాయి.
తొలిరోజు ఈ మెగా ఏవియేషన్ షోలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ సహా పలువురు ఉన్నతాధికారులు, ఏవియేషన్ రంగానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అనేక కంపెనీల సిఇఓలు పాల్గొననున్నారు. "వింగ్స్ ఇండియా-2026" ప్రారంభ కార్యక్రమంలో ఏపి తరపున రాష్ట్ర పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
