
బెల్‌లో 610 ట్రైనీ ఇంజినీర్ పోస్టులు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రెయినీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 610 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 7లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల అర్హత విషయానికి వస్తే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/మెకానికల్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్/ఈడబ్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్యూబీడీ అభ్యర్థులు పాస్ మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది. అభ్యర్థులకు సంబంధిత రంగంలో కనీసం ఒక సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ ఇండస్ట్రియల్ అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్యూబీడీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్/ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజుగా రూ.177గా ఉంది. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం
ట్రెయినీ ఇంజనీర్ పోస్టుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదట ఆన్‌లైన్‌లో బెంగళూరులో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో జనరల్ ఆప్టిట్యూడ్, టెక్నికల్ అంశాలపై 85 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. ట్రైనీ ఇంజినీర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.35 వేలు, మూడో ఏడాది రూ.40 వేలు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ www.bel-india.inలో ఉన్న నోటిఫికేషన్‌ను చదవండి.
