
బెదిరింపు రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు: డిప్యూటీ సీఎం
రాష్ట్రంలో అభివృద్ధి పనులను అడ్డుకునేలా కాంట్రాక్టర్లను భయపెడితే ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రౌడీయిజం, గూండాగిరికి పాల్పడే వారిపై అవసరమైతే ఉత్తరప్రదేశ్ తరహా ‘యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్’ ఇవ్వాల్సి వస్తుందని స్పష్టం చేశారు. బెదిరింపులకు దిగే కిరాయి రౌడీలపై బలమైన రాజకీయ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి తీసుకురావద్దని ఆయన హెచ్చరించారు.
శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు తాగునీరు అందించే ‘అమరజీవి జలధార’ వాటర్ గ్రిడ్ పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్నప్పుడే బెదిరింపులకు భయపడలేదని, ఇప్పుడు బాధ్యత లేకుండా మాట్లాడుతూ చంపేస్తామని హెచ్చరిస్తున్నారని విమర్శించారు. పిఠాపురంలో చదువుకునే చిన్న పిల్లల మధ్య కులాలను తీసుకువచ్చే స్థాయికి ప్రతిపక్షం దిగజారిందన్నారు.
అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను భయపెట్టే ప్రయత్నాలు సహించబోమని స్పష్టం చేశారు. దందాలు, గూండాగిరి చేసేవారిని ఉపేక్షించవద్దని ఇటీవల కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. గీత దాటితే చేతిలో గీతలు మాయమయ్యేలా చేస్తామని హెచ్చరించారు.
అమరజీవి జలధారతో అందరికీ తాగునీరు
రూ.3,050 కోట్ల అంచనా వ్యయంతో జల జీవన్ మిషన్ నిధులతో అమరజీవి జలధార పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం రూ.7,910 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాబోయే 35 ఏళ్లలో 1.21 కోట్ల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
అమరజీవి జలధార ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలందరికీ తాగునీరు అందించే పథకమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా తీరప్రాంతాల్లో నివసించే మత్స్యకార కుటుంబాలకు మేలు చేసేలా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశామని చెప్పారు. 2027 నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం తాను తగ్గిన సందర్భాలను కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. తాను తగ్గకపోతే పల్లె పండగ పనులు, వేల కిలోమీటర్ల రోడ్లు, ఫారం పాండ్లు, మినీ గోకులాల నిర్మాణం సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు. లంచం అనే మాట లేకుండా పది వేల మందికి పైగా ఉద్యోగులకు పారదర్శకంగా పదోన్నతులు ఇచ్చామని, గత ప్రభుత్వంలో అయితే ప్రతిదానికి రేటు కార్డు ఉండేదని విమర్శించారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకునే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టుకు ‘అమరజీవి జలధార’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకుడిని ఒక కులానికి పరిమితం చేయడం బాధాకరమని అన్నారు. ఆయన త్యాగం తెలుగు ప్రజలందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
గోదావరి పారే ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఏర్పడటం తనను తీవ్రంగా కలిచివేసిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. భూగర్భ జలాలు ఆక్వా కాలుష్యంతో కలుషితమైపోయాయని నీరు పసుపు రంగులో రావడం చూసి బాధపడ్డానన్నారు. నీరు కలుషితం కాకపోయి ఉంటే ఈ వేల కోట్ల నిధులు ప్రజల పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేవని ఆవేదన వ్యక్తం చేశారు.
జల జీవన్ మిషన్ నిధులు గత ప్రభుత్వంలో దుర్వినియోగం కావడంతో కేంద్రం అనుమానం వ్యక్తం చేసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పైపులు వేసి కనెక్షన్లు ఇవ్వలేదని ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల తాగునీరు అందించాలన్న లక్ష్యాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. అడవి తల్లిబాట వంటి కార్యక్రమాలను నిజాయితీగా అమలు చేసిన తర్వాతే కేంద్రానికి నమ్మకం ఏర్పడి భారీ నిధులు మంజూరయ్యాయని చెప్పారు.
కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధులు మంజూరు
రాజోలుకు వెళ్లినప్పుడు శివాలయాన్ని బాగు చేయాలని అడిగారు. ఆలయం పునర్నిర్మాణానికి కావలసిన నిధులను సమకూర్చుతామని హామీ ఇచ్చాము. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్తే పూజారులు భక్తుల సౌకర్యార్థం మండపం నిర్మించేందుకు సహకరించాలని కోరారు. దీనిని పూర్తి చేయడానికి 2,000 మంది భక్తులు దీక్ష విరమణ చేపట్టేలా మండపం 96 గదులతో కూడిన సత్రం నిర్మించేందుకు రూ. 35.19 కోట్లు టీటీడీ బోర్డు ఆమోదం ఇచ్చింది. నిధులు మంజూరు చేయడంలో సహకరించిన ముఖ్యమంత్రి, టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో మరియు బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, కె. పార్థసారథి, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, ప్రభుత్వ విప్‌లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.
