
బెదిరింపు ధోరణి మానుకోండి : పరిటాల సునీత
వైసీపీ నాయకులు బెదిరింపు ధోరణికి స్వస్తి పలకాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హితవు పలికారు. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో ఆమె లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 23 మంది లబ్ధిదారులకు రూ. 28 లక్షల ఆరు వేల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ అధికారం ఉన్న ఐదేళ్లూ బెదిరింపులు, దౌర్జన్యాలతో పాలన సాగించిన వైసీపీ ఇంకా ఆ ధోరణి మానుకోలేదని విమర్శించారు.
డిజిటల్ బుక్ పేరుతో అధికారుల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ప్రజల ఆరోగ్యం విషయం ఖర్చుకు వెనుకాడటం లేదని, అందకు నిదర్శనం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడమే అని అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవల్ని మరింత విస్తృతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. కానీ వైసీపీ నాయకులు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో నిర్మిస్తుంటే... ప్రైవేటు పరం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పీపీపీకు ప్రైవేటుకు మధ్య తేడా ఎన్నిసార్లు అర్థమయ్యేలా చెప్పినా అర్థం కానట్టు నటిస్తున్నారని అభిప్రాయపడ్డారు. డిజిటల్ బుక్ పేరుతో అధికారుల్ని, పోలీసుల్ని బెదిరిస్తున్నారని, ఇదే విధానం కొనసాగితే ప్రజలే బుద్ధి చెబుతారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. సీఎం ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ అనంతరం లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
