
బెట్టింగ్ యాప్ కేసు: యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప ఆస్తులు జప్తు చేసిన ఈడీ
అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ 1xBetకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు తీసుకుంది. ఈ కేసులో మాజీ భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, సినీ నటుడు సోనూ సూద్, మాజీ టీఎంసీ ఎంపీ మిమీ చక్రవర్తి సహా పలువురు ప్రముఖుల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ అక్రమ బెట్టింగ్ యాప్ కేసు విలువ రూ.1,000 కోట్లకు మించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ కేసులో ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు చెందిన రూ.2.5 కోట్ల విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి. అక్రమ బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన డబ్బుతో ఆయన ఈ ఆస్తులు కొనుగోలు చేశారని ఈడీ అభియోగం. యువరాజ్ సింగ్‌ను ఈడీ ఇప్పటికే విచారణకు పిలిచి ప్రశ్నించినట్టు అధికారులు తెలిపారు. ఈడీ ప్రకారం, ఈ ఆస్తులను “నేరాల ద్వారా వచ్చిన ఆదాయం” (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్)గా గుర్తించారు. అదే విధంగా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు చెందిన రూ.8.26 లక్షల విలువైన ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. ఉతప్ప కూడా గతంలో ఈడీ విచారణకు హాజరైనట్లు సమాచారం.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రచారానికి సంబంధించి కేవలం క్రికెటర్లే కాకుండా, పలువురు సినీ తారలకు కూడా ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. ఈ విడతలో మొత్తం రూ. 7.93 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులో నటుడు సోనూ సూద్‌కు చెందిన రూ. కోటి, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తికి చెందిన రూ. 59 లక్షలు, నటి నేహా శర్మకు చెందిన రూ. 1.26 కోట్లు, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రాకు చెందిన రూ. 47 లక్షలతో పాటు మోడల్ ఊర్వశి రౌతేల తల్లికి సంబంధించిన రూ. 2.02 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులన్నింటినీ అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు. అంటే, దర్యాప్తు పూర్తయ్యే వరకు వారు ఈ ఆస్తులను అమ్మడానికి లేదా ఇతరులకు బదిలీ చేయడానికి వీలుండదు.
ఈ కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనాకు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇప్పుడు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప సహా మరికొందరి ఆస్తుల జప్తుతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.
కేసు నేపథ్యం
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో పోలీసులు నమోదు చేసిన అనేక ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఎఫ్ఐఆర్‌లు అన్నీ 1xBet అనే విదేశీ అక్రమ బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై నమోదయ్యాయి. ఈ యాప్ విదేశీ దేశమైన క్యురాకావోలో రిజిస్టర్ అయి ఉండగా, భారత్‌లో అక్రమంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. ఈ యాప్ ద్వారా వచ్చిన అక్రమ డబ్బును వివిధ మార్గాల్లో తెల్లదనంగా మార్చారని (మనీ లాండరింగ్) ఈడీ అనుమానిస్తోంది. ఈ యాప్‌కు భారత్‌లో పనిచేయడానికి ఎలాంటి అనుమతి లేదు. అయినా కూడా సోషల్ మీడియా, ఆన్‌లైన్ వీడియోలు, ప్రింట్ మీడియా ద్వారా భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఈ సంస్థ ప్రచారం చేసింది.
ఈడీ దర్యాప్తు ప్రకారం, పలువురు సెలబ్రిటీలు ఈ అక్రమ బెట్టింగ్ యాప్‌ను ప్రచారం చేయడానికి భారీ ఒప్పందాలు చేసుకున్నారు. అయితే, వారు ఈ ప్రచారాన్ని నేరుగా బెట్టింగ్ యాప్ పేరుతో కాకుండా, ఇతర బ్రాండ్ల (సరోగేట్ బ్రాండ్స్) ముసుగులో చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ ప్రచారాల కోసం వారికి ఇచ్చిన డబ్బును నేరుగా కాకుండా, విదేశీ కంపెనీల ద్వారా చేతులు మార్చి పంపించారని, తద్వారా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా దాచాలని ప్రయత్నించారని అధికారులు గుర్తించారు. ప్రజలను మోసం చేసి బెట్టింగ్ ద్వారా సంపాదించిన ఈ డబ్బును 'నేరపూరిత ఆదాయం'గా ఈడీ తేల్చి చెప్పింది. అందుకే ఆ డబ్బుతో కొన్న లేదా దానికి సమానమైన ఆస్తులను ఇప్పుడు అధికారులు జప్తు చేస్తున్నారు.
ప్రజలకు ఈడీ హెచ్చరిక
అక్రమ బెట్టింగ్, జూదం వంటి యాప్‌ల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, అవి అక్రమ నగదు లావాదేవీలకు (మనీ లాండరింగ్) దారి తీస్తాయని ఈడీ ప్రజలను హెచ్చరించింది. సామాన్యులు ఇటువంటి మోసపూరిత యాప్‌లకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానాస్పద లావాదేవీలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు, ఈడీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. అదే సమయంలో సెలబ్రిటీలకు, సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు కూడా ఈడీ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇటువంటి అక్రమ ప్లాట్‌ఫామ్‌లను నేరుగా గానీ లేదా వేరే బ్రాండ్ల ముసుగులో గానీ ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి ఒప్పందాలు చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.
