
బెంగాల్ సిండికేట్ పాలనను అంతం చేస్తాం: అమిత్ షా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బంకురాలో నిర్వహించిన బహిరంగ సభలో అధికార తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం 'సిండికేట్' పాలన సాగిస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి, తన మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ రాజకీయ ఎదుగుదల కోసం, ఆయన ప్రయోజనాల కోసమే మమతా బెనర్జీ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ సిండికేట్ వ్యవస్థ బెంగాల్ ప్రజల రక్తాన్ని పీల్చుకుంటోందని, బీజేపీ అధికారంలోకి రాగానే ఈ మాఫియాను పూర్తిగా అణిచివేస్తామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే అక్రమార్కులను తలకిందులుగా వేలాడదీసైనా సరే, వ్యవస్థను చక్కదిద్దుతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మహిళా భద్రత, దుర్గాపూర్ ఘటన
రాష్ట్రంలో మహిళల భద్రత గాలిలో దీపంలా మారిందని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. 2025లో జరిగిన దుర్గాపూర్ గ్యాంగ్‌రేప్ ఘటనను ప్రస్తావిస్తూ, మమతా బెనర్జీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మహిళలు రాత్రిపూట బయటకు రాకూడదని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటని, అదే బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలో అర్ధరాత్రి పూట కూడా మహిళలు ఒంటిపై బంగారంతో నిర్భయంగా తిరుగుతున్నారని ఆయన ఉదాహరణగా చెప్పారు. బెంగాల్‌లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
రైతు సమస్యలు - బంగాళాదుంపల ఎగుమతి
బంకురా ప్రాంతంలోని బంగాళాదుంప రైతుల దుస్థితికి మమతా బెనర్జీ అహంకారమే కారణమని అమిత్ షా ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, జార్ఖండ్‌లకు బంగాళాదుంపలను ఎగుమతి చేయకుండా అడ్డుకోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. మార్కెట్లో కిలో రూ. 20 పలకాల్సిన పంటను, ఇక్కడ రైతులు కేవలం రూ. 2లకే అమ్ముకోవాల్సి వస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సరిహద్దులు తెరిచి, బెంగాల్ రైతుల పంటను దేశవ్యాప్తంగా విక్రయించేలా చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.
బంకురా నిర్లక్ష్యంపైనా..
గత 15 ఏళ్లుగా మమతా ప్రభుత్వం బంకురా జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని షా విమర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధిని పక్కన పెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. "బంకురాను నిర్లక్ష్యం చేసినందుకు మమతా దీదీకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది, ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ లెక్కను సరిచేస్తారు" అని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాల కల్పనకు బీజేపీ కట్టుబడి ఉందని, అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలను అగ్రభాగాన నిలుపుతామని వాగ్దానం చేశారు.
బంకురా అసెంబ్లీ స్థానంలో ఈసారి హోరాహోరీ పోరు సాగుతోంది. బీజేపీ తన సిట్టింగ్ ఎమ్మెల్యే నీలాద్రి శేఖర్ దానాను మళ్ళీ బరిలోకి దించగా, టీఎంసీ నుంచి అనూప్ మండల్ పోటీ చేస్తున్నారు. గత 2021 ఎన్నికల్లో నీలాద్రి కేవలం 0.7 శాతం స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి కూడా ఇక్కడ గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో, అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ 77 స్థానాలకు ఎగబాకిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి అధికారాన్ని చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల షెడ్యూల్, అంచనాలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్నాయి. మే 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. 2021లో టీఎంసీ 213 స్థానాలతో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, ఈ ఐదేళ్లలో బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అవినీతి, మహిళలపై అకృత్యాలు, నిరుద్యోగం వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని బీజేపీ ముందుకు వెళ్తుండగా, సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని టీఎంసీ ధీమాగా ఉంది. ఈ పోరు బెంగాల్ భవిష్యత్తును నిర్ణయించనుంది.
