Let's talk: editor@tmv.in
బెంగాల్ 'సర్': న్యాయాధికారుల నియామకానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

బెంగాల్ 'సర్': న్యాయాధికారుల నియామకానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

Shaik Mohammad Shaffee
21 ఫిబ్రవరి, 2026

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం, ఈసీ మధ్య పరస్పర నమ్మకం లేకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. పరిస్థితులు అసాధారణంగా మారడంతో, ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు వంటి సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించేందుకు ప్రస్తుత, మాజీ జిల్లా న్యాయాధికారులను నియమించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఓటర్ల పేర్ల తొలగింపుపై న్యాయాధికారుల పర్యవేక్షణ

ఓటర్ల జాబితాలో వివరాల సరిపోలకపోవడం (లాజికల్ డిస్క్రిపెన్సీ) వల్ల ఎవరి పేరైనా జాబితా నుండి తొలగిపోయే అవకాశం ఉంటే, అటువంటి సమస్యలను ఇకపై న్యాయాధికారులే స్వయంగా పరిశీలించి పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా 2002 ఓటర్ల జాబితాతో పోల్చినప్పుడు, తల్లిదండ్రుల పేర్లలో తేడాలు ఉండటం లేదా తల్లిదండ్రులు-పిల్లల మధ్య వయస్సు వ్యత్యాసం 15 ఏళ్ల కంటే తక్కువగా లేదా 50 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో చాలామంది పేర్లు తొలగింపునకు గురవుతున్నాయి. ఇటువంటి సాంకేతిక సమస్యల వల్ల ఓటర్లు నష్టపోకుండా ఉండేందుకు, ఆ అభ్యంతరాలను నిష్పక్షపాతంగా విచారించే బాధ్యతను న్యాయాధికారులకు అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది.

కలకత్తా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు కీలక బాధ్యత

ఎస్‌ఐఆర్‌ పనిలో రాష్ట్ర ప్రభుత్వం తగినంతగా గ్రేడ్‌-ఏ అధికారులను కేటాయించలేదని గుర్తించిన సుప్రీంకోర్టు, కలకత్తా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సుజోయ్ పాల్‌ను కొంతమంది ప్రస్తుత న్యాయమూర్తులను విడుదల చేయాలని, అలాగే అదనపు జిల్లా న్యాయమూర్తులు, జిల్లా న్యాయమూర్తుల స్థాయిలోని మాజీ న్యాయమూర్తులను గుర్తించి సహకారం తీసుకోవాలని కోరింది. ఈ ప్రక్రియకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయడానికి శనివారం కీలక సమావేశం నిర్వహించాలని కూడా ఆదేశించింది. ఆ సమావేశానికి రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ, భారత ఎన్నికల సంఘం ప్రతినిధులు, రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌, కేంద్రం తరఫున అదనపు సాలిసిటర్‌ జనరల్‌, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ హాజరుకానున్నారు.

ఫిబ్రవరి 28లోపు తుది జాబితాకు అనుమతి

రాష్ట్ర ప్రభుత్వ తీవ్ర అభ్యంతరాలను పక్కనపెట్టి, ఈసీకి ఫిబ్రవరి 28లోపు తుది ఓటరు జాబితా ప్రచురించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆ తర్వాత అవసరమైతే అనుబంధ ఓటరు జాబితాలను విడుదల చేసుకోవచ్చని స్పష్టం చేసింది. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటర్ల పేర్ల చేర్పు సాధ్యమేనని పేర్కొంటూ, దీనివల్ల ఎవరికీ నష్టం జరగదని కోర్టు అభిప్రాయపడింది.

ఎస్‌ఆర్‌వోలు-ఈఆర్‌వోలపై వాదనలు

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌, ‘స్పెషల్‌ రోల్‌ ఆఫీసర్లు’ (ఎస్‌ఆర్‌వోలు) ఎన్నికల రోల్‌ ఆఫీసర్లు (ఈఆర్‌వోలు) తీసుకున్న నిర్ణయాలను పెద్ద ఎత్తున తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈసీ ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఎస్‌ఆర్‌వోలు వ్యవస్థ మొదటి నుంచే ఉందని తెలిపింది. ఈసీ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.

చట్టవ్యవస్థపై ఆందోళన

బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, ఫిబ్రవరి 28లోపు తుది జాబితా విడుదలకు అనుమతిస్తే చట్టవ్యవస్థ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సమతుల్యత దృష్ట్యా, న్యాయమూర్తులు క్లెయిమ్స్‌, అభ్యంతరాలను పరిశీలించే సమయంలో ఈసీ మైక్రో–ఆబ్జర్వర్లు, రాష్ట్ర అధికారులు వారికి సహాయంగా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

డీజీపీకి ఘాటు హెచ్చరిక

ఈసీ తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది డీఎస్‌ నాయుడు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అధికారులపై బెదిరింపులు, నోటీసులు చించివేయడం వంటి ఘటనలు జరిగినా ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీజేఐ సూర్యకాంత్‌ తీవ్రంగా స్పందిస్తూ, “ఎన్నికల సమయంలో ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు దురదృష్టకరం. చర్యలు తీసుకోకపోతే డీజీపీ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు.

భద్రత, లాజిస్టిక్‌ సపోర్ట్‌ ఆదేశాలు

ఎస్‌ఐఆర్‌ పనిలో నియమితులయ్యే న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి భద్రత, లాజిస్టిక్‌ సహాయం అందించాలని కోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు ఇచ్చే ఆదేశాలు కోర్టు ఆదేశాలుగానే పరిగణించబడతాయని స్పష్టం చేస్తూ, ఆదేశాల అమలుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ‘డీమ్‌డ్‌ డిప్యుటేషన్‌’ కింద పనిచేస్తారని పేర్కొంది. ఎస్‌ఐఆర్‌ అధికారులకు ఎదురవుతున్న బెదిరింపులపై తీసుకున్న చర్యల వివరాలతో డీజీపీ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది.

రాజకీయ పార్టీల స్పందన

బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియలో సుప్రీంకోర్టు న్యాయాధికారులను నియమించడంపై రాజకీయ పార్టీలు భిన్నంగా స్పందించాయి. ఈ నిర్ణయాన్ని ప్రజల విజయంగా టీఎంసీ అభివర్ణించగా, ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వమే గందరగోళాన్ని సృష్టిస్తోందని బీజేపీ ఆరోపించింది. నిజమైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని టీఎంసీ విమర్శించగా, బోగస్ ఓటర్లను తొలగించడానికే ఈ సవరణ అవసరమని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుపడుతోందని బీజేపీ నేతలు అంటున్నారు.

బెంగాల్ 'సర్': న్యాయాధికారుల నియామకానికి సుప్రీంకోర్టు ఆదేశాలు - Tholi Paluku