Let's talk: editor@tmv.in
బెంగాల్‌ లో బీజేపీ నూతన రాష్ట్ర కమిటీ ప్రకటన

బెంగాల్‌ లో బీజేపీ నూతన రాష్ట్ర కమిటీ ప్రకటన

Pinjari Chand
8 జనవరి, 2026

అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు బీజేపీ పశ్చిమ బెంగాల్ తన రాష్ట్ర స్థాయి కమిటీని బుధవారం ప్రకటించింది. పాత నాయకత్వం, కొత్త ముఖాల మధ్య సమతుల్యత సాధించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కమిటీ, అంతర్గత విభేదాలను తగ్గిస్తూ ఎన్నికల సన్నాహాలపై దృష్టి పెట్టినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం 35 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీని, గత ఏడాది జూలైలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమిక్ భట్టాచార్య ప్రకటించారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన దాదాపు ఆరు నెలల తరువాత కొత్త కమిటీని వివరాలు వెల్లడించారు. అయితే ఆలస్యంగా కమిటీని రూపొందించడానికి పాత నాయకులు, 2019 తర్వాత పార్టీలో చేరిన నేతల మధ్య ఉన్న విభేదాలే కారణమని సమాచారం.

ఈ కమిటీలో నియామకాలకన్నా తొలగింపులే ఎక్కువ చర్చకు దారితీశాయి. ముఖ్యంగా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌కు ఈ కమిటీలో స్థానం దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటన సందర్భంగా ఘోష్ రాజకీయంగా మరింత చురుకుగా ఉండాలని సూచించినట్టు వార్తలు రావడంతో, ఆయనకు ఏదైనా కీలక పదవి లభిస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. అయితే చివరికి ఆయనను కమిటీకి దూరంగా ఉంచారు. పార్టీ వర్గాల ప్రకారం ఇది ఘోష్‌ను పక్కన పెట్టడంకన్నా, సంస్థాగత బాధ్యతలు, ఎన్నికల నాయకత్వం మధ్య స్పష్టత తీసుకురావాలన్న వ్యూహాత్మక నిర్ణయం. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడే అవకాశమున్న కొందరు సీనియర్ నేతలను ఉద్దేశపూర్వకంగా కమిటీకి బయట ఉంచినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

జనరల్ సెక్రటరీగా సౌమిత్ర ఖాన్

ఈ పునర్వ్యవస్థీకరణలో లాభపడిన ముఖ్య నేతలలో బిష్ణుపూర్ ఎంపీ సౌమిత్ర ఖాన్ ఒకరు. ఆయనను జనరల్ సెక్రటరీగా నియమించారు. అలాగే లాకెట్ ఛటర్జీ, లోక్‌సభ సభ్యుడు జ్యోతిర్మయ్ సింగ్ మహాతోలను కూడా జనరల్ సెక్రటరీలుగా కొనసాగించారు. ఇది 2021 తర్వాత పార్టీ బలం తగ్గిన దక్షిణ, పశ్చిమ బెంగాల్ జిల్లాల్లో మళ్లీ పట్టు సాధించేందుకు తీసుకున్న కీలక నిర్ణయంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మాజీ జనరల్ సెక్రటరీలు అగ్నిమిత్ర పాల్, జగన్నాథ్ ఛటర్జీ, అలాగే ఎమ్మెల్యే దీపక్ బర్మన్లను ఉపాధ్యక్షులుగా నియమించారు. ఈ మార్పు వారిని పూర్తిగా పక్కన పెట్టకుండా, ప్రతిష్ఠను నిలుపుకుంటూనే కార్యాచరణ అధికారాన్ని పరిమితం చేసే ప్రయత్నంగా పార్టీ అంతర్గతంగా అర్థం చేసుకుంటున్నారు.

అనుబంధ విభాగాల నాయకత్వాన్ని కూడా ఈ సందర్భంగా ఖరారు చేశారు. యువమోర్చా బాధ్యతలను ఇంద్రనిల్ ఖాన్, మహిళా మోర్చాను ఫల్గుని పత్ర, కిసాన్ మోర్చాను రాజీవ్ భౌమిక్, ఓబీసీ మోర్చాను శుభేందు సర్కార్, ఎస్సీ మోర్చాను సుజిత్ బిశ్వాస్ కొనసాగిస్తారు. ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా ఎంపీ ఖగెన్ ముర్మును నియమించారు.

ముఖ్యంగా, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా అలి హొసైన్‌ను తిరిగి నియమించడం పార్టీ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే టీఎంసీ మాజీ నేత తపస్ రాయ్‌ను ఉపాధ్యక్షుడిగా చేర్చడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలాన్ని పెంచే ప్రయత్నంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం కమిటీలో 12 ఉపాధ్యక్షులు, 5గురు జనరల్ సెక్రటరీలు, 12 సెక్రటరీలు ఉండగా, మహిళలకు సుమారు 20 శాతం ప్రాతినిధ్యం లభించింది. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్–మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ కొత్త కమిటీ ద్వారా అంతర్గత అసంతృప్తిని తగ్గించి, బూత్ స్థాయి పనితీరును బలోపేతం చేయడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది.