Let's talk: editor@tmv.in
బెంగాల్ ప్రజలు బాంబులకు ఓట్లతో సమాధానం ఇస్తారు : అమిత్ షా

బెంగాల్ ప్రజలు బాంబులకు ఓట్లతో సమాధానం ఇస్తారు : అమిత్ షా

Pinjari Chand
14 ఏప్రిల్, 2026

బాంబులు, తుపాకీ కాల్పులకు బెంగాల్ ప్రజలు ఓట్లతో సమాధానం ఇస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ప్రజలు ఈసారి మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. సోమవారం బీర్భూమ్ జిల్లాలోని మయురేశ్వర్, ఖైరాసోల్ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగించారు. ప్రజలు టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించితే సిండికేట్ వ్యవస్థ, ‘కట్ మనీ’ వ్యవహారాలను పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు. టీఎంసీకి అనుకూలంగా ఉన్న నేరగాళ్లు బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలను చాలా కాలంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. మే 4న ఓట్ల లెక్కింపు అనంతరం బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. బీర్భూమ్ జిల్లాలో ఏప్రిల్ 23న తొలి దశ పోలింగ్ జరుగుతుందని, రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న నిర్వహిస్తారని తెలిపారు. ఓట్ల లెక్కింపు మే 4న జరుగనుంది.

చొరబాటుదారులపై చర్యలు

బెంగాల్‌లో చొరబాటుదారులను వెళ్లగొట్టడం ఈ ఎన్నికల ప్రధాన లక్ష్యమని షా చెప్పారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద ఫెన్సింగ్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా చొరబాటుదారులను గుర్తించి బయటకు పంపుతామని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యూసీసీ అమలు చేస్తామని షా ప్రకటించారు. దీంతో కొన్ని వర్గాల్లో ఉన్న బహుభార్యత్వం వంటి ఆచారాలకు ముగింపు వస్తుందని చెప్పారు.

అవినీతి ఆరోపణలు

టీఎంసీ ప్రభుత్వం రూ.5,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు, పశువుల అక్రమ రవాణా, రేషన్ కుంభకోణం, మన్రేగా, పీఎం ఆవాస్ పథకాలలో అవినీతి జరిగిందని విమర్శించారు. మహిళలు సాయంత్రం 7 గంటల తర్వాత బయటకు రావద్దని చెప్పడం సిగ్గుచేటని షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలు రాత్రి ఒక గంటకు కూడా స్వేచ్ఛగా ప్రయాణించే పరిస్థితి కల్పిస్తామని చెప్పారు.

ఎన్నికల హామీలు

బీజేపీ ఎన్నికల ప్రణాళికలో భాగంగా పలు హామీలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తామని చెప్పారు. మహిళలు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000, గర్భిణీ మహిళలకు రూ.21,000, వికలాంగులకు రూ.2,000 సహాయం అందిస్తామని తెలిపారు. అలాగే మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్, రాష్ట్ర బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని పేర్కొన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చే వార్షిక సహాయాన్ని రూ.6,000 నుంచి రూ.9,000కు పెంచుతామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రం–రాష్ట్రం కలిసి పనిచేసే ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఏర్పడి అభివృద్ధి వేగవంతం అవుతుందని షా అన్నారు.