Let's talk: editor@tmv.in
బెంగాల్ ఓటరు జాబితా పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం నిరాకరణ

బెంగాల్ ఓటరు జాబితా పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం నిరాకరణ

Pinjari Chand
14 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించిన అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను ముందస్తుగా దాఖలు చేసిందిగా (ప్రీమేచ్యూర్‌) పేర్కొంటూ బాధితులు ముందుగా సంబంధిత అప్పీలెట్‌ ట్రిబ్యునళ్లను ఆశ్రయించాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌, న్యాయమూర్తి జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన బెంచ్‌ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌‌) సమయంలో తమ పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించారని ఆరోపిస్తూ 13 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ సరైన విధి విధానాలు పాటించకుండా పేర్లు తొలగిస్తోందని, వాటిపై వేసిన అప్పీల్స్‌ సమయానికి విచారణకు రావడం లేదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ దశలో మా జోక్యం అవసరం లేదు

అయితే ఇప్పటికే పిటిషనర్లు అప్పీలెట్‌ ట్రిబ్యునళ్లను ఆశ్రయించినందున ఈ దశలో సుప్రీంకోర్టు జోక్యం అవసరం లేదని బెంచ్‌ అభిప్రాయపడింది. ఈ కేసు విషయార్ధంపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో ఎన్నికల సంఘం తరఫున హాజరైన న్యాయవాది ట్రిబ్యునళ్ల ముందు ప్రస్తుతం సుమారు 30 నుంచి 34 లక్షల అప్పీల్స్‌ పెండింగ్‌లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ప్రతి ట్రిబ్యునల్‌ ముందు లక్షకు పైగా కేసులు ఉన్నాయని బెంచ్‌ పేర్కొంది.

ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని జస్టిస్‌ బాగ్చి విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఒక దేశంలో పుట్టి అక్కడ ఓటు హక్కు వినియోగించడం కేవలం రాజ్యాంగ హక్కు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యాన్ని సూచించే భావోద్వేగ అంశం కూడా అని ఆయన అన్నారు. అయితే ఎన్నికల ప్రక్రియను ఈ దశలో అడ్డుకోవడం సరికాదని, అప్పీలెట్‌ ట్రిబ్యునళ్ల ద్వారా పరిష్కారం పొందే అవకాశాన్ని ముందుగా వినియోగించుకోవాలని కోర్టు సూచించింది. ఎన్నికలను నిలిపివేయడం లేదా జోక్యం చేసుకోవడం చాలా ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సాధ్యమని పేర్కొంది.