
బెంగాల్ ఎన్నికల కోసం బీజేపీ కార్యాచరణ..తెరపైకి దిలీప్ ఘోష్
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర విభాగం పరిస్థితులను సమీక్షించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ కార్యాచరణ ప్రణాళికను బుధవారం వివరించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు (ప్రస్తుత, మాజీ) పాల్గొన్న సమావేశంలో ఒకే లక్ష్యం కోసం కలిసి పనిచేయడంపై దృష్టి పెడుతూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌ను ఎన్నికల బరిలో కీలక ముఖాల్లో ఒకరిగా ముందుకుతెచ్చారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యకలాపాల్లో కనిపించని దిలీప్ ఘోష్‌ను కూడా ఈ క్లోజ్డ్‌డోర్ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సంస్థాగత బాధ్యతలు వహిస్తున్న నేతలు పాల్గొన్నారు.
ఎన్నికల సంసిద్ధతలను అంచనా వేయడానికే ఈ సమావేశం నిర్వహించామని పార్టీ రాష్ట్ర నేత ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా, దిలీప్ ఘోష్‌తో పాటు మరో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుకాంత మజుందార్, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య, రాష్ట్ర ప్రతిపక్ష నేత సువేందు అధికారి తదితరులతో అమిత్ షా ఇంకో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. దీంతో పార్టీ లోపలి పాత నేతలు–కొత్త నేతల మధ్య గ్యాప్‌లను తగ్గించే ప్రయత్నం జరుగుతోందని సంకేతాలు కనిపిస్తున్నాయి.
క్రియాశీలకంగా యాక్టివ్ గా మారుతా
నేను ఎక్కువగా చెప్పలేను. కానీ 2026 ఎన్నికల్లో క్రియాశీలకంగా ఉండే దిలీప్ ఘోష్‌ను మీరు చూస్తారు. నా అనుభవాలు, అభిప్రాయాలు వినేందుకు నన్ను పిలిచారు అని ఘోష్ సమావేశం అనంతరం మీడియాతో అన్నారు. ఈ సమావేశానికి బెంగాల్‌కు కేంద్ర పరిశీలకులుగా ఉన్న సునీల్ బన్సల్, భూపేంద్ర యాదవ్, బిప్లబ్ దేవ్, అమిత్ మాల్వియా తదితరులు కూడా హాజరయ్యారు. సమావేశంలో అమిత్ షా ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు ఇచ్చారని ఓ నేత వెల్లడించారు. ప్రతి వారం కనీసం నాలుగు రోజులు తమ నియోజకవర్గాల్లో ఉండాలి. రోజుకు కనీసం ఐదు స్ట్రీట్ కార్నర్ సమావేశాల్లో పాల్గొనాలని సూచించినట్లు చెప్పారు. రాబోయే రెండు నెలల్లో తమ పనితీరుతో పార్టీకి తమ విలువను నిరూపించినవారికే టికెట్లు లభిస్తాయని స్పష్టం చేసినట్లు తెలిపారు. అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో అభ్యర్థుల నుంచి ఎదురైన అనుకూలతలు, సమస్యలు, గెలుపు–ఓటములకు దారితీసిన అంశాలపై అమిత్ షా అభిప్రాయాలు విన్నారని తెలిపారు. తమ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై అవగాహనలను పంచుకోవాలని కూడా సూచించినట్లు పేర్కొన్నారు.
దిలీప్ ఘోష్‌ను తిరిగి ముందుకు తెచ్చే నిర్ణయంపై మాట్లాడుతూ ఈ ఏడాది ప్రారంభంలో డీఘాలో జగన్నాథ ఆలయ సముదాయం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఘోష్ భేటీ అయిన దృశ్యాలు టీవీల్లో ప్రసారమైన తరువాత ఆయనను పార్టీ బ్యాక్‌బెంచ్ కు నెట్టినట్లుగా భావన ఏర్పడిందని, అయితే ఆ కూలింగ్ ఆఫ్ కాలం ఇప్పుడు ముగిసినట్టే అని ఓ నేత వ్యాఖ్యానించారు. రాబోయే నెలల్లో ఘోష్ పార్టీలో కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీని అసెంబ్లీలో మూడు స్థానాల నుంచి 70కి పైగా స్థానాలకు తీసుకెళ్లడంలో, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాలు గెలిపించడంలో ఘోష్ కీలక పాత్ర పోషించారని, ఆయన దూకుడైన ప్రచార శైలిని ఈసారి కూడా వినియోగించాలని పార్టీ భావిస్తోందని నేతలు తెలిపారు.
పార్టీలో అందరూ ఉత్సాహంగా ఉన్నారు. 2026 ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో నిజమైన మార్పు తీసుకొస్తామని సువేందు అధికారి సమావేశానికి ముందు మీడియాతో అన్నారు.
దాడి చేసినా భయపడలేదు
బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ము మాట్లాడుతూ టీఎంసీ దుర్వినియోగ పాలనకు వ్యతిరేకంగా నేను పోరాడేందుకు సిద్ధం. ఇటీవలి వరద ప్రభావిత నగ్రకాటా ప్రాంతంలో టీఎంసీ గూండాలు నాపై దాడి చేసినా భయపడలేదు. ఉత్తర బెంగాల్‌తో పాటు మొత్తం రాష్ట్ర ప్రజలు మా వెంట ఉన్నారని అన్నారు. మరో సీనియర్ ఎమ్మెల్యే ప్రకారం, బూత్ స్థాయి కార్యకర్తల ద్వారా విస్తృత స్థాయి గ్రాస్ రూట్ లెవల్ ఉద్యమం, అన్ని నియోజకవర్గాల్లో ‘విస్తారక్‌లు’ (గ్రాస్‌రూట్ వర్కర్లు) నియామకం ప్రాధాన్యమని షా స్పష్టం చేశారు. బీజేపీ సంస్థాగత పునాదిని బలపర్చడంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని ఆయన నొక్కిచెప్పారని తెలిపారు. 2026 ఎన్నికల వరకు ప్రతి నెలా కొన్ని రోజులు అమిత్ షా కోల్‌కతాలో మకాం వేస్తారని ఆ నేత చెప్పారు.
స్వామి వివేకానంద, బంకిం చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం ఏర్పడితే బెంగాల్ వారసత్వం, సంస్కృతిని సరైన ఆత్మతో పునరుజ్జీవింపజేస్తామని షా హామీ ఇచ్చినట్లు తెలిపారు.
పార్టీ ప్రతినిధుల సమావేశం అనంతరం అమిత్ షా నగరంలోని ఒక ఆడిటోరియంలో పార్టీ కార్యకర్తల సదస్సును ఉద్దేశించి ప్రసంగించి, సెంట్రల్ కోల్‌కతాలోని తాంతనియా కాళీ దేవాలయాన్ని సందర్శించిన తరువాత ఢిల్లీకి బయలుదేరారు.
50 సీట్లు కూడా దాటదు
టీఎంసీ నేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లు కూడా దాటదని, ఘోర పరాజయం ఎదుర్కోంటుందని వ్యాఖ్యానించారు. అమిత్ షాను రాజకీయ పర్యాటకుడిగా అభివర్ణిస్తూ, ఆయన పర్యటనలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. టీఎంసీ అధికారిక ప్రకటనలో బీజేపీ గత అంచనాల వైఫల్యాలను గుర్తుచేస్తూ 2021లో ‘పక్కా 200 పార్’ అన్న నినాదం 77 సీట్లకే పరిమితమైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 30 సీట్లు అన్నారు, ఫలితం 12 మాత్రమే అని పేర్కొంది.
