Let's talk: editor@tmv.in
బెంగాల్‌లో 58 లక్షలకు పైగా ఓట్లను తొలగించిన ‘సర్’

బెంగాల్‌లో 58 లక్షలకు పైగా ఓట్లను తొలగించిన ‘సర్’

Pinjari Chand
17 డిసెంబర్, 2025

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్–సర్) ప్రక్రియ పూర్తయిన అనంతరం, పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాలను మంగళవారం ఎన్నికల కమిషన్ (ఈసీ) విడుదల చేసింది. ఈ ప్రక్రియలో మరణం, వలస, ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించకపోవడం వంటి పలు కారణాలతో 58 లక్షలకుపైగా ఓటర్ల పేర్లు తొలగించామని అధికారులు తెలిపారు. ఈ తొలగింపుల తర్వాత, రాష్ట్ర డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో 7,08,16,631 మంది ఓటర్లు మాత్రమే ఉండనున్నారని, ఇది ఎస్ఐఆర్ కు ముందు ఉన్న 7,66,37,529 మంది ఓటర్లతో పోలిస్తే 58,20,898 మంది తక్కువ అని అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

ఎందుకు తొలగించారో వివరణ

రాష్ట్రంలో వచ్చే ఏడాది ఆరంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముండటంతో, డ్రాఫ్ట్ ఓటరు జాబితాలతో పాటు, బూత్ ల వారీగా తొలగించిన ఓటర్ల జాబితా, జాబితా నుంచి తొలగించడానికి సంబంధించిన కారణాలను కూడా విడుదల చేశారు. ఇవన్నీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో), పశ్చిమ బెంగాల్ వెబ్‌సైట్, ఎన్నికల కమిషన్ ఓటర్ పోర్టల్, ECINET యాప్‌లో అందుబాటులో ఉంచారు.

ఎన్నికల కమిషన్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, తొలగించిన ఓటర్లకు సంబంధించిన విచారణ ప్రక్రియ సుమారు వారం రోజుల్లో ప్రారంభమవుతుందని తెలిపారు. డ్రాఫ్ట్ జాబితాల ప్రచురణకు, విచారణ ప్రారంభానికి మధ్య గ్యాప్ ఉండటానికి కారణంగా విచారణ నోటీసుల ముద్రణ, వాటిని సంబంధిత ఓటర్లకు అందజేయడం, అలాగే ఎన్నికల కమిషన్ డేటాబేస్‌లో డిజిటల్ బ్యాకప్ సృష్టించడం అని ఆ అధికారి వివరించారు.

నవంబర్ 4న ప్రారంభమై డిసెంబర్ 11న ముగిసిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల భవితవ్యంపై నెలల తరబడి కొనసాగిన రాజకీయ ఆందోళనలు, ప్రజల్లో ఉన్న అనిశ్చితి మధ్యే ఈ డ్రాఫ్ట్ జాబితాలు వెలువరించారు.

ఎన్నికల కమిషన్ ప్రకారం, జనవరి 2025 ఓటరు జాబితాలో ఉన్న కానీ ఎస్ఐఆర్ అనంతరం డ్రాఫ్ట్ జాబితాలో లేని ఓటర్ల పేర్లనే తొలగించిన జాబితాగా గుర్తించారు. తొలగించిన ఓటర్ల జాబితా కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఓటర్లు తమ పేర్లు లేదా కుటుంబ సభ్యుల పేర్లను గురించి విచారించడానికి వీలుగా, అలాగే ఏ కారణం కింద తొలగించారో తెలుసుకునే వెసలుబాటును కూడా కల్పించింది.

కమిషన్ వర్గాల సమాచారం ప్రకారం, తొలగించిన వాటిలో ఎక్కువ భాగం సేకరించలేని ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాలు కారణంగానే జరిగాయి. వీటి సంఖ్య 58 లక్షలను మించిపోయింది.

ఈ కేసుల్లో—

• మరణించినవారు

• శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లినవారు

• నమోదు చేసిన చిరునామాలో లభించని వారు

• ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పేరు ఉన్న డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు.

గత వారం సీఈవో కార్యాలయం విడుదల చేసిన విభజన వివరాల ప్రకారం, 24,16,852 మంది ఓటర్లు మరణించినట్లుగా గుర్తించారు. 19,88,076 మంది శాశ్వతంగా వేరే చోటుకు వెళ్లినవారు, 12,20,038 మంది చిరునామాలో లభించని లేదా గల్లంతైనవారు. ఇంకా 1.38 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు, 1,83,328 మందిని ‘గోస్ట్ ఓటర్లు’(జీవించి ఉండకపోయినా, లేదా అసలు ఆ వ్యక్తే లేకపోయినా ఓటరు జాబితాలో పేరు ఉన్నవారే)గా గుర్తించారు. ఎన్యుమరేషన్ సమయంలో గుర్తించిన ఇతర సాంకేతిక సమస్యల కారణంగా 57,000కు పైగా పేర్లు తొలగించారు. మొత్తంగా, 58,20,898 మంది ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితా నుంచి తీసేశారు. ఈ తొలగింపుల అనంతరం రాష్ట్రంలో 7,08,16,631 మంది ఓటర్లు డ్రాఫ్ట్ జాబితాలో ఉండనున్నారని అధికారిక డేటా తెలిపింది.

డ్రాఫ్ట్ ఓటరు జాబితా నుంచి పేరు తొలగించడం అంటే అంతిమ నిర్ణయం కాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. డ్రాఫ్ట్ జాబితా విడుదలైన తర్వాత, బాధిత ఓటర్లు ఫాం-6, డిక్లరేషన్ ఫారం, అవసరమైన ఆధార పత్రాలతో తమ అభ్యంతరాలు లేదా క్లెయిమ్‌లు దాఖలు చేయవచ్చు. ఈ ప్రక్రియకు డిసెంబర్ 16, 2025 నుంచి జనవరి 15, 2026 వరకు గడువు ఉందని ఒక ఈసీ అధికారి తెలిపారు.

భయపడాల్సిన అవసరం లేదు.. పత్రాలు చూపించి ఓటు హక్కు పొందవచ్చు

పశ్చిమ బెంగాల్‌కు స్పెషల్ రోల్ ఆబ్జర్వర్‌గా నియమితులైన మాజీ బ్యూరోక్రాట్ సుబ్రత గుప్తా, డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేని ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. 2002 ఓటరు జాబితాలతో వివరాలు సరిపోలని సుమారు 30 లక్షల మంది ఓటర్లకు విచారణలు నిర్వహించనున్నామని, ఆ విచారణల్లో వారు పత్రాలు చూపించి తమ అర్హతను నిరూపించుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. తుది నిర్ణయం ఆ తరువాతే తీసుకుంటామని స్పష్టం చేశారు.

డ్రాఫ్ట్ జాబితాలు అధికారికంగా విడుదల కాకముందే, ఒక రోజు ముందే బీఎల్వో యాప్‌లో కనిపించడంతో రాష్ట్రంలో తీవ్ర రాజకీయ చర్చ మొదలైంది. మంగళవారం విడుదల అనంతరం, అందరు ఓటర్లు ఆన్‌లైన్ లేదా తమ స్థానిక బీఎల్వోలను సంప్రదించి తమ పేరు పరిశీలించుకోవాలని కమిషన్ సూచించింది.

డ్రాఫ్ట్ జాబితాల హార్డ్ కాపీలు బూత్ స్థాయిలో బీఎల్వోల వద్ద అందుబాటులో ఉంటాయి. విడుదల రోజున వీలైనంతవరకు బీఎల్వోలు బూత్‌ల వద్ద ఉండాలని ఆదేశించారు. అలాగే, డ్రాఫ్ట్ జాబితాల సాఫ్ట్ కాపీలను రాష్ట్రంలోని ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేస్తారు. డ్రాఫ్ట్ జాబితాల విడుదలతో రాష్ట్రంలో రాజకీయ విభేదాలు మరింత తీవ్రతరం అయ్యాయి.

టీఎంసీ విమర్శ

డ్రాఫ్ట్ జాబితాలు విడుదలైన వెంటనే, బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి కుట్ర పన్నుతున్నాయని అధికార టీఎంసీ పార్టీ ఆరోపించింది. దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లను విచారణ చేయడం ప్రజలను భయపెట్టే ప్రయత్నమే అని పేర్కొంది.

ఇది పౌరసత్వాన్ని ప్రశ్నించే చర్యగా అభివర్ణించింది.

టీఎంసీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు, ప్రతి ఓటరి హక్కును తమ పార్టీ కాపాడుతుందని, ప్రజల్లో భయాందోళన సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు నలుగురు బీఎల్వోలతో సహా 40 మంది సాధారణ పౌరులు, సర్ వల్ల కలిగిన భయాందోళన కారణంగా ఆత్మహత్యలు తదితర కారణాలతో మరణించారని ఆరోపించింది. ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు, రాష్ట్రంలో ‘ఎస్ఐఆర్ పానిక్’కు సంబంధించిన ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.

ఆరోపణలను కొట్టి పారేసిన బీజేపీ

రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారీ మాట్లాడుతూ ఇది కేవలం ఆరంభం మాత్రమే. బ్రేక్‌ఫాస్ట్ ఇప్పుడే మొదలైంది. ఇంకా లంచ్, టీ, డిన్నర్ కూడా ఉన్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తొలగింపులపై కొత్త గణాంకాలు వెల్లడించకపోయినా, ఫిబ్రవరి 14న తుది ఓటరు జాబితా విడుదలైన తర్వాత మాట్లాడతానని అధికారి చెప్పారు.

అయితే బీజేపీ ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరణతో చేసినవిగా అభివర్ణిస్తూ, మానవ విషాదాలను రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకుంటున్నారని టీఎంసీపై విమర్శలు గుప్పించింది.

బెంగాల్‌లో 58 లక్షలకు పైగా ఓట్లను తొలగించిన ‘సర్’ - Tholi Paluku