Let's talk: editor@tmv.in
బెంగాల్‌లో సీఏఏ అమలు చేస్తాం: మోడీ

బెంగాల్‌లో సీఏఏ అమలు చేస్తాం: మోడీ

Pinjari Chand
12 ఏప్రిల్, 2026

పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సీఏఏ) అమలును వేగవంతం చేసి శరణార్థులకు త్వరగా పౌరసత్వం కల్పిస్తామని ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. అదే సమయంలో దేశంలోకి చొరబడ్డ అక్రమ వలసదారులు ‘బ్యాగులు సర్దుకుని వెళ్లాల్సిందే’అని ఆయన హెచ్చరించారు. పూర్బ బర్ధమాన్ జిల్లాలోని కట్వాలో శనివారం జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఆయన, బెంగాల్‌లో ప్రభావవంతమైన శరణార్థి వర్గాలైన మటువా కమ్యూనిటీ, నామశూద్ర కమ్యూనిటీలకు ప్రత్యేకంగా భరోసా ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ నేతల దయతో కాదు, భారత రాజ్యాంగం, సీఏఏ చట్టం ద్వారా వారికి రక్షణ ఉందని చెప్పారు.

‘చొరబాటుదారులను బయటకు పంపిస్తాం’

శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇస్తూనే అక్రమ వలసలపై ఆయన కఠిన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోకి చొరబడ్డ వారిని బయటకు పంపిస్తాం. ప్రతి చొరబాటుదారునికీ నా సందేశం ఒక్కటే మీ సామాను సర్దుకుని వెళ్లే సమయం వచ్చిందని ఆయన అన్నారు. చొరబాటుదారులకు సహకరించిన వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

టీఎంసీపై విమర్శలు

రాష్ట్రంలో శరణార్థి గుర్తింపు, పౌరసత్వ అంశాలు దశాబ్దాలుగా రాజకీయంగా కీలకంగా ఉన్నాయని పేర్కొంటూ, టీఎంసీ ప్రజల్లో భయం పుట్టించి వారి ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందని మోడీ ఆరోపించారు. బీజేపీ తాజాగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోల ఉన్న ఆరు హామీలను అమలు చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు. బెంగాల్‌ను అభివృద్ధిలో కొత్త ఎత్తులకు తీసుకెళ్లే రోడ్‌మ్యాప్ అందులో ఉందని అన్నారు.

మహిళలు, యువత కోసం హామీలు

మహిళల కోసం నెలకు రూ.3,000 భృతి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిందని తెలిపారు. మహిళల భద్రతకు పూర్తి హామీ ఉంటుందని చెప్పారు. ఉద్యోగ అవకాశాల విషయంలో వయోపరిమితి దాటిపోయిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వ నియామకాలలో వయో పరిమితి సడలింపు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఉద్యోగులు, రైతులకు హామీలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ పే కమిషన్‌ అమలు చేస్తామని చెప్పారు. అలాగే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం–కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద వచ్చే రూ.6,000తో పాటు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అదనంగా రూ.3,000 ఇవ్వడం ద్వారా మొత్తం రూ.9,000 అందజేస్తామని తెలిపారు.

అవినీతిపై వైట్‌పేపర్

టీఎంసీ నేతల అవినీతిపై బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైట్‌పేపర్ విడుదల చేస్తుందని మోడీ ప్రకటించారు. టీఎంసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సిండికేట్ల అవినీతిపై పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు.

ఆయుష్మాన్ భారత్ అమలు

బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని బెంగాల్‌లో అమలు చేస్తామని హమీ ఇచ్చారు. అధికార మార్పునకు బెంగాల్ సిద్ధంగా ఉందని సభకు భారీగా వచ్చిన జనసందోహం చూస్తే స్పష్టమవుతుందని ఆయన అన్నారు. ఈ దృశ్యం మే 4న వచ్చే ఫలితాలకు ట్రైలర్‌ లాంటిది. భయంపై విశ్వాసం గెలుస్తుందని మోడీ పేర్కొన్నారు.