Let's talk: editor@tmv.in
బెంగాల్‌లో సీఈవో కార్యాలయం వద్ద బీఎల్వోల ఆందోళన

బెంగాల్‌లో సీఈవో కార్యాలయం వద్ద బీఎల్వోల ఆందోళన

Pinjari Chand
2 డిసెంబర్, 2025

పశ్చిమ బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. బీఎల్వో అధికార్ రక్షా కమిటీ సభ్యులు నిరసన చేపట్టగా, అదే సమయంలో బీజేపీ నేత సువేందు అధికారి, పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల అధికారులతో సమావేశం కోసం అక్కడికి రావడంతో పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఎన్నికల కార్యాలయం చుట్టూ పోలీసులు ముందు జాగ్రత్తగా బారికేడ్లు ఏర్పాటు చేసి అదనపు బలగాలను మోహరించారు. అయితే బీజేపీ ప్రతినిధుల బృందం కార్యాలయంలోకి ప్రవేశించిన కొద్ది సేపటికే, నిరసనకారులు మెమొరాండం అందించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించారు.

నిరసనకారులు సువేందు అధికారిపై ‘గో బ్యాక్’ నినాదాలు చేస్తుండగా, అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ప్రతిగా నినాదాలు చేశారు. కొన్ని రోజులుగా బూత్ లెవల్ ఆఫీసర్ల పనిభారం తగ్గించడం, ఎస్ఐఆర్ గడువును 2 నెలలు పొడిగించడం, విధి నిర్వహణలో మరణించిన బీఎల్వోల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అసలు బీఎల్వోల భాగస్వామ్యం తక్కువగానే ఉన్నప్పటికీ, ఈరోజు రద్దీ పెరిగిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఎన్నికల కార్యాలయ్యంలో సువేందు అధికారి అధికారులకు మెమొరాండం అందించి పలు డిమాండ్లు ఉంచారు. అందులో విరమణ పొందిన ఐఎఎస్ అధికారులను తొలగించడం, ఎస్డీవో ర్యాంక్‌లో లేని ఈఆర్వోలను తప్పించడం, అలాగే తప్పుడు ఓటర్లను ప్రత్యేకంగా ‘బంగ్లాదేశీ ముస్లింలను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 14 తర్వాత జరిగే విచారణలన్నీ లైవ్ సీసీటీవీ పర్యవేక్షణలో జరగాలి అని ఆయన తెలిపారు. అయన సమావేశం తరువాత బయటకు రాగానే నిరసనకారులు ‘చోర్ చోర్’ నినాదాలు గట్టిగా వినిపించగా, సువేందు అధికారి కూడా ప్రతిస్పందిస్తూ ‘చోర్ చోర్ దూర్ హటావ్, డాకట్ రాణీ దూర్ హటావ్’ అంటూ నినాదాలు చేశారు. బయట జరుగుతున్న నిరసన టీఎంసీ స్క్రిప్ట్ అని అక్కడి ఓ అధికారి ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఆగిపోతే, టీఎంసీకి తమ అక్రమ ఓటు బ్యాంక్ నిలబెట్టుకోవడం సులభమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఎన్నికల అధికారులు స్పందించేందుకు నిరాకరించారు. సమావేశం యథావిధిగా జరిగింది అని మాత్రమే తెలిపారు.

బెంగాల్‌లో సీఈవో కార్యాలయం వద్ద బీఎల్వోల ఆందోళన - Tholi Paluku