
బెంగాల్‌లో ‘సర్’ ప్రభావం.. మారనున్న రాజకీయ సమీకరణాలు
పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న 2026 అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా కొత్త రాజకీయ సమీకరణాల మధ్య జరగనున్నాయి. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90.83 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించడంతో ఎన్నికల లెక్కలు గణనీయంగా మారిపోయాయి. దీంతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) బలమైన కోటలుగా భావించిన ప్రాంతాలు మాత్రమే కాకుండా, బీజేపీ ప్రభావం ఉన్న ప్రాంతాలు కూడా కొత్త అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. ఈ సవరణతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.77 కోట్లకు తగ్గింది. ఫలితంగా ఈ నెలలో జరగనున్న రెండు దశల ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీలు గత ఎన్నికల కంటే పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో పోటీ పడాల్సి వస్తోంది.
టీఎంసీ బలమైన ప్రాంతాల్లో భారీ మార్పులు
2011 నుంచి టీఎంసీ అధికారానికి ప్రధాన బలం అయిన జిల్లాల్లోనే ఎక్కువగా ఓటర్ల పేర్లు తొలగించారు. ముఖ్యంగా నార్త్ 24 పరగణాస్, సౌత్ 24 పరగణాస్, ముర్షీదాబాద్, నాదియా, మాల్డా, హూగ్లీ, హౌరా, ఉత్తర్ దినాజ్‌పూర్, పుర్బ బర్ధమాన్ జిల్లాల్లో భారీ స్థాయిలో పేర్లు తీసేశారు. ఈ తొమ్మిది జిల్లాల్లోనే మొత్తం 66.6 లక్షల ఓటర్లు తొలగించగా, ఇది రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన ఓట్లలో దాదాపు మూడు వంతులు. ఈ జిల్లాల్లో కలిపి 178 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంతో టీఎంసీకి ఉన్న ఆధిక్యం కొంత మేర తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తొలగించిన ఓట్ల వివరాలు ఇలా..
నార్త్ 24 పరగణాస్ (31 స్థానాలు) – 12.6 లక్షల ఓటర్లు తొలగింపు, సౌత్ 24 పరగణాస్ (33 స్థానాలు) – 10.91 లక్షలు, ముర్షీదాబాద్ (22 స్థానాలు) – 7.48 లక్షలు, నాదియా (17 స్థానాలు) – 4.85 లక్షలు, మాల్డా (16 స్థానాలు) – 4.59 లక్షలుగా ఉన్నాయి.
రాజకీయ విశ్లేషకుడు బిశ్వనాథ్ చక్రవర్తి మాట్లాడుతూ, టీఎంసీ ఎన్నికల లెక్కలు మైనార్టీ ఓటర్లు, మహిళా ఓటర్లు, రెండు 24 పరగణాస్ జిల్లాలపై ఆధారపడి ఉంటాయని తెలిపారు. ఈ వర్గాల్లో ఓటర్ల సంఖ్య తగ్గితే బీజేపీకి మరిన్ని స్థానాల్లో గెలిచే అవకాశం పెరుగుతుందని ఆయన అన్నారు.
మహిళా ఓటర్ల నిష్పత్తిలో మార్పు
ఈ సవరణతో మహిళా ఓటర్ల నిష్పత్తిలో కూడా స్వల్ప మార్పు వచ్చింది. సవరణకు ముందు 1000 మంది పురుషులకు 959 మహిళా ఓటర్లు ఉండగా, సవరణ తర్వాత అది 950కి తగ్గింది. 2011 నుంచి మమతా బెనర్జీకి మహిళా ఓటర్ల మద్దతు కీలకంగా ఉన్న నేపథ్యంలో ఇది కూడా ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ముస్లిం ఓటర్ల ఐక్యతకు అవకాశం
అయితే ఈ సవరణలో మరో రాజకీయ ప్రభావం కూడా కనిపిస్తోంది. ముస్లింలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఓటర్ల పేర్లు తొలగించడంతో అక్కడ భద్రతా ఆందోళనలు పెరిగి ముస్లిం ఓటర్లు మరింతగా టీఎంసీ వెనుక ఏకమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుడు సుమన్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. అలా జరిగితే ఐఎస్‌ఎఫ్, ఏఐఎంఐఎం వంటి చిన్న పార్టీలకు అవకాశాలు తగ్గవచ్చని ఆయన అన్నారు.
బీజేపీపై మటువా ఓటు బ్యాంక్ ప్రభావం
బీజేపీకి మాత్రం మరో సవాలు ఎదురైంది. మటువా శరణార్థి వర్గం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో 55 అసెంబ్లీ స్థానాల్లో సవరణ ప్రభావం కనిపించనుంది. ఈ వర్గానికి చెందిన కుటుంబాల్లో దాదాపు 70 శాతం వరకు ఈ ప్రక్రియ ప్రభావం పడిందని కమ్యూనిటీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 1.3 కోట్ల మటువా ఓటర్లు ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 77 స్థానాల్లో సగానికి పైగా ఈ వర్గం మద్దతుతోనే వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాదియా జిల్లాలో అయితే విచారణకు పెట్టిన ఓటర్లలో 78 శాతం పేర్లు తొలగించడం రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైంది.
ఉత్తర బెంగాల్‌లో బీజేపీ ఆశలు
అయితే ఉత్తర బెంగాల్ ప్రాంతంలో మాత్రం బీజేపీ బలంగా ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. అక్కడ కూడా ఓటర్ల పేర్లు తొలగించినప్పటికీ అవి ఎక్కువగా ముస్లిం ప్రాంతాల్లోనే జరిగాయని వారు భావిస్తున్నారు. కూచ్ బిహార్ – 2.42 లక్షలు, జల్పాయిగురి – 2.01 లక్షలు, దార్జిలింగ్ – 1.9 లక్షలు, ఉత్తర్ దినాజ్‌పూర్ – 3.63 లక్షలు, ఇక జంగల్‌మహల్ ప్రాంతంలో బీజేపీ ప్రధాన ఓటు బ్యాంక్ పెద్దగా ప్రభావితం కాలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. జార్గ్రామ్ – 55,364, పురులియా – 1.91 లక్షలు, బాంకురా – 1.43 లక్షలు ఓట్లను తొలగించారు.
టీఎంసీ ఆరోపణలు
టీఎంసీ నాయకులు మాత్రం ఈ ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అల్పసంఖ్యాకులు, మహిళలు, వలస కార్మికుల పేర్లు ఎక్కువగా తొలగించారని వారు ఆరోపిస్తున్నారు. ఇది ఓటర్ల జాబితా సవరణలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల మ్యాప్‌ను మార్చే ప్రయత్నమని టీఎంసీ నాయకుడు వ్యాఖ్యానించారు.
నిర్ణయాత్మకంగా మారిన స్వల్ప తేడా స్థానాలు
స్వల్ప మెజారిటీతో గెలిచిన స్థానాల్లో పెద్ద అనిశ్చితి కనిపిస్తోంది. సుమారు 120కిపైగా అసెంబ్లీ స్థానాల్లో తొలగించిన ఓటర్ల సంఖ్య గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువగా ఉంది.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో
టీఎంసీ 45 స్థానాల్లో 10 వేల కంటే తక్కువ మెజారిటీతో గెలిచింది
బీజేపీ 20 స్థానాల్లో అదే స్థాయిలో విజయం సాధించింది
రెండు దశల్లో పోలింగ్
రెండో దశ – 8 జిల్లాల్లోని 142 స్థానాలు (49.38 లక్షల తొలగింపులు) మొత్తానికి ఈసారి బెంగాల్ ఎన్నికల్లో విజయం పోలింగ్‌కు వచ్చిన ఓటర్లతో పాటు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల ప్రభావంపైనా ఆధారపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
