
బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలనే బీజేపీ కుట్ర: మమతా
మాల్దా జిల్లాలో న్యాయాధికారులను చుట్టుముట్టిన ఘటనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించి చివరకు రాష్ట్రపతి పాలన విధించాలనే కుట్రను బీజేపీ పన్నుతోందని ఆరోపించారు. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బ్లూప్రింట్ రూపొందిస్తున్నారని విమర్శించారు. ముర్షీదాబాద్ జిల్లాలోని సాగర్‌దిఘి, సుతి ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల సభల్లో మమత మాట్లాడారు. ప్రజలు బీజేపీ ప్రేరేపణలకు లోనుకాకుండా శాంతి పాటించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు అల్లర్లు రేపడం బీజేపీ వ్యూహమని ఆమె ఆరోపించారు. మాల్దా ఘటనపై స్పందిస్తూ, ప్రజలకు నిరసన వ్యక్తం చేసే హక్కు ఉన్నప్పటికీ న్యాయమూర్తులు లేదా న్యాయాధికారులను ఎవరూ తాకకూడదని ఆమె అన్నారు. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని మొత్తం బెంగాల్ రాష్ట్రాన్ని అపకీర్తిపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు.
ఈ ఘటనను ఖండించిన మమత, న్యాయాధికారుల భద్రతను కల్పించడంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విఫలమైందని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రకటన తరువాత పరిపాలనా అధికారాలను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకున్నందున భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా అదే సంస్థపై ఉందని ఆమె అన్నారు. ఎన్నికల ప్రకటన తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ వంటి కీలక అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసి కొత్త అధికారులను నియమించిందని ఆమె గుర్తుచేశారు. అలాంటి పరిస్థితిలో మాల్దా ఘటనకు బాధ్యత నుంచి ఎన్నికల సంఘం తప్పించుకోలేదని ఆమె పేర్కొన్నారు.
బీజేపీ వ్యూహామై ఉండొచ్చు
ఈ ఘటనను ఉపయోగించుకుని బెంగాల్‌ను అపకీర్తిపాలు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని మమత ఆరోపించారు. దీనిపై ఇప్పటికే సీబీఐ, ఎన్‌ఐఏ వంటి సంస్థలను రంగంలోకి దింపారని ఆమె పేర్కొన్నారు. ఈ అల్లర్ల వెనుక తమ పార్టీకి చెందినవారు లేరని స్పష్టం చేసిన మమత, దీని వెనుక ఏ రాజకీయ పార్టీ ఉందో తానెరిగినట్లు సూచించారు. ఈ సంఘటనకు బీజేపీ వ్యూహం కూడా కారణమై ఉండొచ్చని ఆమె ఆరోపించారు. బీజేపీ వ్యూహం ఎన్నికలను రద్దు చేయించడం, ఆ తరువాత బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించడమేనని మమత ఆరోపించారు. ఇక ఓటర్ల జాబితా సవరణలో అనేక ప్రాంతాల్లో ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. తన భవానీపూర్ నియోజకవర్గంలోనే సుమారు 40 వేల ఓటర్ల పేర్లు తొలగించారని ఆమె తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన ప్రక్రియ ఎన్నికల ముందు పెద్ద వివాదంగా మారింది. ముఖ్యంగా మైనారిటీలు, బెంగాలీ మాట్లాడే వలసదారులు, ఆర్థికంగా బలహీన వర్గాల ఓటర్ల పేర్లను ఎక్కువగా తొలగిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
