
బెంగాల్‌లో రాజకీయ వారసుల దండయాత్ర
ఒకప్పుడు విద్యార్థి ఉద్యమాలు, కార్మిక సంఘాలు, వీధి పోరాటాల నుంచి నాయకులను తయారు చేసిన పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు కొత్త మార్పును చూస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల్లోనూ రాజకీయ వారసత్వానికి చెందిన అభ్యర్థులు భారీ సంఖ్యలో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అదే దారిలో అన్ని రాజకీయ కుటుంబాలు నడుస్తోన్నాయి. గతంలో కుటుంబ రాజకీయాలను తీవ్రంగా విమర్శించిన బెంగాల్‌లో ఇప్పుడు కుమారులు, కుమార్తెలు, సోదరులు, భార్యలు వంటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అభ్యర్థులుగా నిలుస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య వరకు, అలాగే కాంగ్రెస్ నాయకులు సోమెన్ మిత్రా ప్రియా రంజన్ దాస్ మున్షీ వంటి ప్రముఖులు గతంలో విద్యార్థి రాజకీయాల నుంచే ఎదిగారు. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయం క్రమంగా మారుతోంది.
అన్ని పార్టీల్లో వారసత్వ రాజకీయాలు
ఈ ఎన్నికల్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అత్యధికంగా రాజకీయ వారసత్వం ఉన్న అభ్యర్థులను నిలబెట్టింది. అయితే భారతీయ జనతా పార్టీ , ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) వంటి ఇతర పార్టీలు కూడా ఇప్పుడు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఒకప్పుడు బెంగాల్‌లో కుటుంబ రాజకీయాలు ఇతర రాష్ట్రాల్లో మాత్రమే ఉంటాయని భావించేవారు. కానీ ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
టీఎంసీ అభ్యర్థులలో కుటుంబ నేపథ్యం
పశ్చిమ బర్ద్వాన్ జిల్లాలో మాజీ మంత్రి మోలోయ్ ఘటక్ ఆసన్సోల్ ఉత్తర్ నుంచి పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడు అభిజిత్ ఘటక్ కుల్టి నుంచి బరిలో నిలిచారు. బెహాలా పుర్బా ఎమ్మెల్యే రత్నా చట్టోపాధ్యాయను బెహాలా పశ్చిమకు మార్చగా, ఆమె సోదరుడు సుభాషిష్ దాస్ మహేశ్తాలా నుంచి పోటీ చేస్తున్నారు. ఆ సీటుకు గతంలో వారి తండ్రి దులాల్ దాస్ ప్రాతినిధ్యం వహించారు. సింగూర్ నుంచి బేచారం మన్నా, హరిపాల్ నుంచి ఆయన భార్య కరాబి మన్నా కూడా మరో రాజకీయ దంపతులుగా నిలుస్తున్నారు.
కొత్త తరం నేతలకు అవకాశాలు
టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కుమారుడు సిర్సన్య బంద్యోపాధ్యాయ ఉత్తరపారా నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే పానిహాటిలో ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ కుమారుడు తీర్తంకర్ ఘోష్ అభ్యర్థిగా ఉన్నారు. మణిక్తలలో మాజీ మంత్రి సధన్ పాండే కుమార్తె శ్రేయా పాండేకు టీఎంసీ టికెట్ ఇచ్చింది.
అదే దారిలోనూ బీజేపీ
కుటుంబ రాజకీయాలను విమర్శించే బీజేపీ కూడా ఇప్పుడు రాజకీయ కుటుంబాలకు టికెట్లు ఇస్తోంది. పూర్బ మెదినిపూర్ జిల్లాలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తమ్ముడు దిబ్యేందు అధికారి ఎగ్రా నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపీ అర్జున్ సింగ్ కుమారుడు పవన్ సింగ్ భట్‌పారా నుంచి బరిలోకి దిగగా, అర్జున్ సింగ్ స్వయంగా నోయాపారా నుంచి పోటీ చేస్తున్నారు. మటువా సమాజానికి చెందిన సుబ్రత ఠాకూర్ గైఘాటా నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ సోదరుడు. శాంతను ఠాకూర్ భార్య సోమా ఠాకూర్ బాగ్దా నుంచి పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్, వామపక్షాల్లోనూ ఇదే ధోరణి
కాంగ్రెస్ మాజీ ఎంపీ మౌసం నూర్ మాలతీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఏబీఏ ఘనీ ఖాన్ చౌధురీ కుటుంబానికి చెందినవారు. పురులియాలోని బగ్ముండి నుంచి మాజీ ఎంపీ దేవేంద్ర మహతో కుమారుడు నేపాల్ మహతో బరిలోకి దిగారు. వామపక్షాల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తోంది. సిపిఎం మాజీ మంత్రి గౌతమ్ దేవ్ కుమారుడు సప్తర్షి దేవ్ రాజార్హాట్–న్యూ టౌన్ నుంచి పోటీ చేస్తున్నారు.
క్షీణిస్తున్న విద్యార్థి రాజకీయాల ప్రభావం
రాజకీయ విశ్లేషకుడు సుమన్ భట్టాచార్య అభిప్రాయం ప్రకారం, విద్యార్థి రాజకీయాలు బలహీనపడటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు జిల్లా నాయకుడు లేదా విద్యార్థి ఉద్యమ నాయకుడు ఎమ్మెల్యేగా ఎదగడానికి అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ మార్గం తగ్గిపోవడంతో ప్రభావవంతమైన కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు పార్టీల్లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయాలు కొత్త రాజకీయ నాయకులను తయారు చేసే కేంద్రాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ బలహీనపడటంతో ఏర్పడిన ఖాళీని రాజకీయ కుటుంబాలు భర్తీ చేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
