Let's talk: editor@tmv.in
బెంగాల్‌లో మోడీ పేరుతోనే ఓట్లడుగుతాం: సామిక్ భట్టాచార్య

బెంగాల్‌లో మోడీ పేరుతోనే ఓట్లడుగుతాం: సామిక్ భట్టాచార్య

Pinjari Chand
6 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్‌ భట్టాచార్య స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివృద్ధి అజెండాను ముందుకు పెట్టుకుని ఆయన పేరుతోనే పార్టీ ఓట్లు కోరుతుందని తెలిపారు. ఆదివారం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భట్టాచార్య మాట్లాడుతూ, బీజేపీ ఎన్నికల్లో వ్యక్తిగత నాయకులను ముందుకు తేవడం కంటే పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలనే ప్రధానంగా ప్రజల ముందుంచుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంపై పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

మమతాపై పోటీ చేసినా.. సువేందు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు

ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారిని నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్ నుంచి పోటీకి నిలబెట్టడం ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తున్నట్లు కాదని స్పష్టం చేశారు. ఢిల్లీ, హర్యానా, ఒడిశా ఎన్నికల్లో కూడా మేం ఎవ్వరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. అయినప్పటికీ విజయం సాధించాం. బెంగాల్‌లో కూడా అదే విధానం కొనసాగుతుందని చెప్పారు. అయితే పార్టీ కేంద్ర నాయకత్వం అవసరమని భావిస్తే తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం మాత్రం మోడీ నాయకత్వం, అభివృద్ధి ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి మమతా ప్రభుత్వం తృణమూల్ పాలనలో అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు పెరిగాయని ఆరోపించారు. ఈ ఎన్నికలను బీజేపీ-తృణమూల్ మధ్య జరిగే పోరుగా ఆయన అభివర్ణించారు.

చొరబాటుదారులను పంపిస్తాం

భవానీపూర్‌లో అధికారి పోటీ చేయడం ద్వారా బెనర్జీకి నేరుగా సవాల్ విసిరినట్టేనని ఆయన చెప్పారు. 2021 నందిగ్రామ్ ఎన్నికల సందర్భాన్ని గుర్తు చేస్తూ, బెనర్జీ ఓటమిని అప్పట్లో ‘లోడ్ షెడింగ్ వల్లే జరిగిందని’ తృణమూల్ చెప్పిందని, ఇప్పుడు అదే విషయాన్ని ప్రజల ముందుంచి మరోసారి పరీక్షిస్తున్నామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే తొలి ప్రాధాన్యతగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలనను స్థాపిస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల తరువాత హింసను అడ్డుకోవడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించడం తదితర అంశాలను అమలు చేస్తామని తెలిపారు. వలసలను బీజేపీ ప్రధాన సమస్యగా చూస్తోందని భట్టాచార్య పేర్కొన్నారు. చొరబాటుదారులను గుర్తించి, అదుపులోకి తీసుకుని, దేశం బయటకు పంపించడమనే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.

మేం బెంగాళీలం అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు

బెంగాల్‌లో హిందీ-హిందూ సంస్కృతి రుద్దాలనే ఆరోపణలను ఆయన ఖండించారు. బెంగాళీలు చేపలు లేకుండా జీవించలేరు. మా పార్టీ స్థాపకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ. మేం బెంగాళీలమే అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మాల్దా జిల్లాలో న్యాయాధికారులపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ, ఎన్నికల సంఘం స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహిస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి బెనర్జీ చేసిన ‘రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనుకుంటున్నారు’ అనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ అలా చేయాలనుకున్నట్లయితే ఈ ప్రభుత్వం ఏడేళ్ల క్రితమే తొలగిపోయేది. కానీ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ప్రజల ఓట్లతో ఆమెను ఓడిస్తామని తెలిపారు. ముస్లిం ఓటర్లకు కూడా ఆయన సందేశం ఇస్తూ, జాతీయ ప్రధాన ప్రవాహంలో భాగమై పిల్లలకు మంచి విద్య అందించి, బుజ్జగింపు రాజకీయాలను తిరస్కరించాలని పిలుపునిచ్చారు.