
బెంగాల్‌లో మహిళలే కీలకం.. యువతే లక్ష్యం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఒకే వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువత, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఆకట్టుకునేలా రెండు పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో విభిన్న హామీలు ప్రకటించాయి. మహిళలు, మైనార్టీలు, ఎస్సీ–ఎస్టీ వర్గాలతో ఏర్పడిన సామాజిక కూటమిపైనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధారపడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. 2011 నుంచి టీఎంసీ అధికారంలో నిలబడటానికి ఇదే ప్రధాన బలం. మరోవైపు బీజేపీ ఈ ఓటు బ్యాంకును విచ్ఛిన్నం చేయడానికి ఆర్థిక సాయం, జాతీయత, మతపరమైన అంశాలను ముందుకు తెస్తోంది.
మహిళలపై ప్రత్యేక దృష్టి
టీఎంసీ మేనిఫెస్టోలో మహిళల సంక్షేమ పథకాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. లక్ష్మీభండార్ పథకం కింద మహిళలకు ఇచ్చే నగదు సహాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చింది. సాధారణ వర్గాల మహిళలకు నెలకు రూ.1,500, ఎస్సీ–ఎస్టీ మహిళలకు రూ.1,700 ఇవ్వాలని ప్రకటించింది. మహిళల ఓట్లు టీఎంసీకి కీలకం కావడంతో ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రయత్నిస్తోంది.
బీజేపీ కూడా మహిళలను ఆకర్షించేందుకు భారీ హామీలను గుప్పించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రతి మహిళకు నెలకు రూ.3,000 సహాయం, ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్, ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మహిళల భద్రత అంశాన్ని కూడా బీజేపీ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తోంది.
మైనార్టీలు–హిందుత్వ రాజకీయాలు
టీఎంసీ మేనిఫెస్టోలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్ర ఓటర్లలో దాదాపు 30 శాతం ఉన్న ముస్లింలు 110కిపైగా నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతారు. వక్ఫ్ ఆస్తులు, ఆలియా యూనివర్సిటీ , మైనార్టీ ప్రాంతాల్లో నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలను టీఎంసీ ప్రస్తావించింది. ఇక బీజేపీ మాత్రం మతపరమైన రాజకీయాలను ప్రధానంగా తీసుకుంది. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో యూసీసీ అమలు చేస్తామని, అక్రమ వలసదారులను గుర్తించి దేశం నుంచి పంపిస్తామని ప్రకటించింది. అలాగే ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తామని చెప్పింది.
తెరపైకి ప్రాంతీయ విశిష్టత
బీజేపీ మరోవైపు బెంగాలీ విశిష్టతను కూడా ప్రచారంలోకి తెచ్చింది. ‘వందే మాతరం’ మ్యూజియం, రవీంద్రనాథ్ ఠాగూర్ సాంస్కృతిక కేంద్రాలు, చైతన్య మహప్రభు సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. బెంగాలీ ఆహార సంస్కృతిపై ఎలాంటి ఆంక్షలు ఉండవని కూడా స్పష్టం చేసింది.
వామపక్షాలు, కాంగ్రెస్ వ్యూహం
ఈ ఎన్నికల్లో అధికార పోరులో టీఎంసీ–బీజేపీ ముందుండగా వామపక్షాలు, కాంగ్రెస్ రాజకీయంగా తమ ప్రాధాన్యతను తిరిగి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగాలు, పరిశ్రమల అభివృద్ధి, నిరుద్యోగ సమస్యలపై ఎక్కువగా దృష్టి పెట్టాయి. వామపక్షాలు ప్రతి కుటుంబానికి ఒక స్థిరమైన ఉద్యోగం, పట్టణాల్లో ఉద్యోగ హామీ పథకం, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. కాంగ్రెస్ మహిళలకు ఆర్థిక సాయం, ఆరోగ్య బీమా విస్తరణ, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణం భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది.
ఓటర్లే లక్ష్యంగా హామీలు
పోలింగ్ సమయం దగ్గరపడుతున్న వేళ ప్రతి పార్టీ తమ హామీల ద్వారా ప్రత్యేక ఓటర్ల వర్గాలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాలు, మత–జాతీయత అంశాలు, ఉద్యోగ హామీలు—ఇలా ప్రతి ప్రకటన ఎన్నికల వ్యూహాలను మార్చేలా రూపొందించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
