Let's talk: editor@tmv.in
బెంగాల్‌లో మమతకు ఈసీ షాక్

బెంగాల్‌లో మమతకు ఈసీ షాక్

Pinjari Chand
17 మార్చి, 2026

అసెంబ్లీ ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్‌లో కీలక పరిపాలన, పోలీసు ఉన్నతాధికారులను ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీఐ) బదిలీ చేసింది. రాష్ట్ర పరిపాలనా చరిత్రలో ఇదొక అరుదైన నిర్ణయంగా భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ చర్యలు తీసుకున్నారు. తొలి ఆదేశంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తి, హోమ్ సెక్రటరీ జగదీశ్‌ ప్రసాద్‌ మీనాలను పదవుల నుంచి తొలగించారు. తదుపరి ఆదేశంతో రాష్ట్ర డీజీపీ పీయూష్‌ పాండే, కోల్‌కతా పోలీస్ కమిషనర్ సుప్రతీం సర్కార్‌‌లను కూడా బదిలీ చేశారు.

ఈసీ తాజా నిర్ణయం ప్రకారం కొత్త నియామకాలు చేపట్టారు.

• దుష్​యాంత్‌ నరియాలా – పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీగా నియామకం

• సంఘమిత్ర ఘోష్ – హోమ్ సెక్రటరీగా నియామకం

• సిద్ధ్‌నాథ్‌ గుప్తా – రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)

• అజయ్‌ కుమార్‌‌నంద్‌ – కోల్‌కతా పోలీస్ కమిషనర్

• అజయ్‌ ముకుంద్‌ రనడే – ఏడీజీ (లా అండ్ ఆర్డర్)

• నటరాజన్‌ రమేశ్‌బాబు – డీజీ (కరెక్షనల్ సర్వీసెస్)

ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఈసీ పేర్కొంది. మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలలోపు కొత్తగా నియమిత అధికారులు తమ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు బదిలీ చేసిన అధికారులకు ఎన్నికలకు సంబంధించిన పోస్టులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ చర్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఎన్నికల ప్రక్రియలో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

వెబ్‌క్యామ్ సరఫరా సంస్థ కాంట్రాక్ట్ రద్దు

ఇక గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించిన వెబ్‌క్యామ్‌ల రికార్డింగ్స్‌లో భారీ లోపాలు బయటపడటంతో ఈసీ ఆ సరఫరా సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. 2021 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల ఫుటేజ్ పరిశీలనలో సుమారు 30 శాతం కెమెరాల్లో ఎలాంటి రికార్డింగ్ లేకపోవడం, మరికొన్నింటిలో కేవలం కొద్ది నిమిషాల వీడియో మాత్రమే ఉండటం గుర్తించారు. దీంతో కొత్త టెండర్ల ద్వారా రాష్ట్రం వెలుపల ఉన్న మూడు కంపెనీలను ఎంపిక చేశారు. ముఖ్యంగా హింసకు గురయ్యే అవకాశం ఉన్న పోలింగ్ కేంద్రాల్లో లోపల, బయట రెండు కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో సుమారు 80,700 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఎన్నికల సమయంలో మొత్తం రెండు లక్షలకు పైగా వెబ్‌క్యామ్‌లు అవసరమవుతాయని అధికారులు తెలిపారు.

వాహనాల్లో కూడా కెమెరాలు

ఎంసీసీ అమల్లోకి వచ్చిన తర్వాత తనిఖీలు నిర్వహించే స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు (ఎస్ఎస్టీ), ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్‌లు (ఎఫ్‌ఎస్‌టీ) వాహనాల్లో కూడా కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి తనిఖీలు ఎక్కడ, ఎప్పుడు జరిగాయో పర్యవేక్షించేందుకు సహాయపడతాయి.

తమిళనాడులో ఆర్థిక లావాదేవీలపై నిఘా

ఇదే సమయంలో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం 23 అమలు సంస్థల సహాయంతో రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్‌ ప్రకారం, పెద్ద మొత్తంలో జరిగే డిజిటల్ వాలెట్, యూపీఐ లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. ఇప్పటివరకు తనిఖీల్లో రూ.1.26 కోట్ల నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

బెంగాల్ అధికారుల బదిలీలపై రాజకీయ దుమారం

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఉన్నతాధికారుల బదిలీలపై రాజకీయ వివాదం నెలకొంది. భారత ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అధికార పార్టీ టీఎంసీ తీవ్రంగా విమర్శించగా, ప్రతిపక్ష పార్టీలు స్వాగతించాయి. అయితే టీఎంసీ ప్రతినిధి కునాల్‌ఘోష్‌ మాట్లాడుతూ, ఈ చర్యను ‘ప్రజాస్వామ్య మార్గంలో గెలవలేమని గ్రహించిన ఒక పార్టీ భయాందోళనలో తీసుకున్న నిర్ణయం’గా అభివర్ణించారు. బీజేపీ బ్యాక్‌డోర్‌‌ రాజకీయాలు చేసినా, పశ్చిమ బెంగాల్ ప్రజలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య ఉన్న బంధాన్ని బలహీనపరచలేరని ఆయన అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్లు లేదా ఉన్నతాధికారులను మార్చగలదేమో కానీ బెంగాల్ ప్రజల అభిప్రాయాలను మార్చలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘాన్ని బీజేపీ తమ విభాగంలా ఉపయోగించుకుంటోందని కూడా ఆయన ఆరోపించారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన రూ.1.96 లక్షల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. ఇందులో ఎంజీఎన్‌రేగా , ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, జల్‌జీవన్‌ మిషన్‌ వంటి పథకాల నిధులు కూడా ఉన్నాయని తెలిపారు.

ప్రతిపక్షాల స్వాగతం

ఇదిలా ఉండగా, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఈసీ చర్యను స్వాగతించారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించని అధికారులను పక్కన పెట్టారు. ఇప్పుడు నిష్పక్షపాతంగా పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కీలక బాధ్యతలు చేపట్టి శాంతియుతంగా, న్యాయంగా ఎన్నికలు జరిగేలా చూస్తారని ఆయన అన్నారు. బీజేపీ అసెంబ్లీ చీఫ్ విప్ శంకర్‌‌ఘోష్‌ కూడా రాష్ట్రంలోని కొంతమంది అధికారులు అధికార పార్టీ టీఎంసీ విభాగంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల పారదర్శకత కోసం ఈసీ జోక్యం అవసరమైందని ఆయన అన్నారు.

సీపీఎం స్పందన

కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్‌) (సీపీఎం) కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్‌ చక్రవర్తి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అధికారులను బదిలీ చేయడం సాధారణమేనని అన్నారు. అయితే బెంగాల్ పరిపాలనా పరిస్థితుల దృష్ట్యా ఈసారి అది మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పారు. ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ఒక అధికారి యూనిఫాం తీసేసి వెంటనే టీఎంసీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా మారే పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్యతో మాజీ డీజీపీ రాజీవ్‌కుమార్‌‌ను ఉద్దేశించినట్లు భావిస్తున్నారు. అయితే చివరికి ముఖ్యమైనది ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడమని చక్రవర్తి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో తటస్థంగా వ్యవహరించాలని ఈసీని కోరారు.