
బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించండి: ప్రధాని మోడీ
పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రధాని నరేంద్రమోడీ ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధికి ఆరు కీలక హామీలు అమలు చేస్తామని గురువారం ఆయన ప్రకటించారు. పూర్వ మెదీనిపూర్ జిల్లాలోని హాల్దియాలో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడిన మోడీ, టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నుంచి వెనక్కి లాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో భయ వాతావరణం నెలకొన్నందున పెట్టుబడులు రావడం లేదని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే నమ్మకమైన వాతావరణం నెలకొల్పుతామని చెప్పారు. టీఎంసీ ప్రభుత్వాన్ని ‘నిర్మమ్ సర్కార్’గా అభివర్ణిస్తూ, అభివృద్ధి చెందకపోవడానికి కొత్త ప్రమాణాలు సృష్టించిందని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి సాధించాలంటే టీఎంసీ ప్రభుత్వాన్ని తప్పించాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపల డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ, టీఎంసీ ప్రభుత్వం ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వస్తే మత్స్యరంగాన్ని అభివృద్ధి చేసి బెంగాల్‌ను స్వయం సమృద్ధిగా మార్చుతామని చెప్పారు.
మోడీ ప్రకటించిన ఆరు హామీలు
• టీఎంసీ పాలనలో ఉన్న భయ వాతావరణాన్ని తొలగించి విశ్వాస వాతావరణం నెలకొల్పడం.
• ప్రభుత్వ వ్యవస్థను ప్రజలకు పూర్తిగా జవాబుదారీగా మార్చడం.
• అవినీతి, మహిళలపై జరిగిన నేరాల కేసులన్నింటినీ మళ్లీ తెరవడం.
• అవినీతికి పాల్పడిన వారందరినీ చట్టం ముందు నిలబెట్టి జైలుకు పంపడం.
• చట్టబద్ధంగా భారత్‌కు వచ్చిన శరణార్థులకు హక్కులు కల్పించడం; అక్రమ ప్రవేశదారులను దేశం నుంచి పంపించడం.
• బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర ఉద్యోగులకు 7వ వేతన సంఘాన్ని అమలు చేయడం.
వాతావరణం అనుకూలంగా లేకపోయినా భారీగా సభకు హాజరైన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది బెంగాల్‌లో ప్రభుత్వ మార్పుకు సంకేతమని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారిపై కూడా ప్రధాని ప్రశంసలు కురిపించారు. 2021లో నందిగ్రామ్‌లో జరిగిన ఎన్నికల్లో అధికారి సాధించిన విజయం ఈసారి కూడా పునరావృతమవుతుందని అన్నారు. టీఎంసీ ప్రభుత్వం రాష్ట్ర పరిశ్రమలను దెబ్బతీసిందని, యువతను మోసం చేసిందని ఆరోపించారు. ప్రైవేట్ రంగాన్ని నాశనం చేసి, ప్రభుత్వ ఉద్యోగాలను డబ్బుకు అమ్ముకున్నారని విమర్శించారు. మతాధారిత రిజర్వేషన్లు అమలు చేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని టీఎంసీపై ఆరోపించిన మోడీ, బెంగాల్‌లో ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ అవసరమని అన్నారు. కేంద్రం–రాష్ట్రం కలిసి పనిచేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
