Let's talk: editor@tmv.in
బెంగాల్‌లో కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల

బెంగాల్‌లో కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల

Pinjari Chand
30 మార్చి, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి పూర్తి స్థాయిలో దిగింది. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ ఆదివారం తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకేసారి 284 మంది అభ్యర్థులను ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో ఎలాంటి కూటములు లేకుండా అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ జాబితాలో ప్రముఖ నేత అధీర్ రంజన్ చౌదరీని బహరాంపూర్ నుంచి బరిలోకి దింపగా, ఇటీవల టీఎంసీని వీడి కాంగ్రెస్‌లో చేరిన మౌసం నూర్కు మలతీపూర్ టికెట్ ఇచ్చారు. దార్జిలింగ్ నుంచి మాధప్ రాయ్, సుజాపూర్ నుంచి అబ్దుల్ హన్నాన్, డమ్‌డమ్ నుంచి సుస్మితా బిశ్వాస్, డైమండ్ హార్బర్ నుంచి గౌతమ్ భట్టాచార్య, అసన్సోల్ దక్షిణ నుంచి సౌవిక్ ముఖర్జీ, అసన్సోల్ ఉత్తర నుంచి ప్రసంజిత్ పుయిటాండి వంటి నేతలకు అవకాశాలు కల్పించారు. అభ్యర్థుల ఎంపికకు ముందు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కే.సి. వేణుగోపాల్ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 294 స్థానాలకు పార్టీకి సుమారు 2,500 దరఖాస్తులు వచ్చినట్లు నేతలు తెలిపారు. అన్ని స్థానాల్లో పోటీ చేయడం కార్యకర్తల అభిలాష అని పార్టీ పేర్కొంది.

అధికారులను బదిలీ చేసిన ఈసీ

ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికత కోసం ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 83 మంది బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారులు (బీడీవోస్‌), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్‌‌వోస్‌)లను బదిలీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో స్థానిక ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ బదిలీలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఇవి రాజకీయ ప్రేరేపిత చర్యలని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న నిర్వహించనున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎన్నికల పోరులో తానూ కీలక పాత్ర పోషించబోతున్నట్టు స్పష్టం చేసింది.